సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసీఫ్, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డిలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణ హోటల్ సెంటర్, మక్కా మసీదు రోడ్డు, కె.ఎల్.రావు రోడ్డులలో విస్తృతంగా పర్యటించారు. 260 గడపలను సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. గత తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతమంతా పూర్తి నిర్లక్ష్యానికి గురైందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్లో దాదాపు రూ. 20 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. దీంతో పాటు సచివాలయ పరిధిలో పాదయాత్ర ముగిసే నాటికి విడుదలయ్యే రూ. 20 లక్షల నిధులతో ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలియజేశారు. చంద్రబాబు పాలనకు, జగనన్న పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని మల్లాది విష్ణు అన్నారు. ఓ సారి గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందర్నీ సమానంగా చూస్తారని.. కానీ చంద్రబాబు మాత్రం పచ్చ నేతలకు దోచిపెట్టడానికే అధికారాన్ని ఉపయోగిస్తారని విమర్శించారు.

డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం
పర్యటనలో భాగంగా ఎక్సెల్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. డంపింగ్ యార్డు తరలింపు పనులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణ పనులపై ఆరా తీశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా ఎక్సెల్ ప్లాంట్ చుట్టూ రూ.1 కోటి 29 లక్షల 50 వేల వ్యయంతో ఇటీవల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రహరీ గోడ ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరుపరుస్తుందన్నారు. ప్లాంట్ ప్రభావం ఎక్కడా కూడా పరిసర ప్రాంతాలపై పడకుండా.. 1.80 మీటర్ల ఎత్తు, 1,208 మీటర్ల పొడవుతో గోడ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు వాతావరణ పరిశుభ్రతకై కాంపౌండ్ వాల్ ఆనుకుని మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ముందుగా ప్రధాన రహదారి వెంబడి గోడ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో రాత్రుళ్లు అల్లరి మూకలు సంచరించకుండా గస్తీ పెంచాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

గోబెల్స్ కు, పచ్చ నేతలకు తేడా లేదు
పింఛన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చ నేతలు పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. 61 వ డివిజన్ శాంతినగర్లో మోర్ల దుర్గారావు పింఛన్ విషయంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు తెలుగుదేశం నేతలు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అప్పటివరకు ఉన్న 16 వేలు పింఛన్లను 25 వేలకు పెంచడం జరిగిందని.. గత ప్రభుత్వం కన్నా ఇవి దాదాపు 9వేలు అధికమని వివరించారు. ఈ ఒక్క నెలలోనే 1,460 నూతన పింఛన్లను అందించినట్లు తెలియజేశారు. కానీ ఒక్కరికి పింఛన్ అందనంత మాత్రాన నియోజకవర్గంలో అసలు పింఛన్ పథకమే లేనట్లుగా బోండా ఉమా చేస్తున్న రాద్ధాంతం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని.. కానీ మోర్ల దుర్గారావు కుటుంబం నెలకు సగటున దాదాపు 400 యూనిట్ల వరకు విద్యుత్ వాడటం వల్ల వారి పింఛన్ ను హోల్డ్ లో పెట్టడం జరిగిందని తెలిపారు. సచివాలయ సిబ్బంది సూచనల మేరకు 300 యూనిట్ల లోపు (231.33 యూనిట్లు) విద్యుత్ వాడటంతో.. పింఛన్ ను పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేయడమైందని వెల్లడించారు. కానీ ఈలోగా ఆ కుటుంబం గుంటూరులో భూమి కొనడంతో ఆ ప్రక్రియ కాస్త మరలా నిలిచిందని తెలియజేశారు. విజయవాడలో ఉంటున్న 826 చ.అ. ఇంటితో పాటు గుంటూరులో కొన్న 248 చ.అ. స్థలం కలిపి మొత్తం 1,074.89 చ.అడుగుల ఆస్తి వారి పేరిట చూపుతోందని వివరించారు. కానీ వాస్తవాలు తెలియకుండా పచ్చ నేతలు గుడ్డ కాల్చి నెత్తిన వేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర మొత్తం మీద కనీసం 5వేల ఓట్లు కూడా లేని బీజేపీ.. 5వేల చోట్ల సభలు నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు విమర్శించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, ఇసరపు రాజా రమేష్, ఉమ్మడి వెంకట్రావు, భోగాది మురళి, నేరెళ్ల శివ, మీసాల సత్యనారాయణ, తోపుల వరలక్ష్మి, బొందిలి శైలజా, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *