డిసెంబర్ 15లోగా పీఎం సూర్యఘర్ లక్ష్యాలను పూర్తి చేయాలి

-అధికారులు, సోలార్ వెండార్లకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పీఎం సూర్యఘర్ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను డిసెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను, సోలార్ వెండార్లను ఆదేశించారు. సోమవారం ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ పరిధిలోని ఎనిమిది జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సోలార్ వెండార్లతో పథకం అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ పథకం కింద ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని 1,91,242 మంది ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 382.48 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నవంబర్ 22 నాటికి 1,58,800 ఇళ్లలో సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయిందని, వీటి సామర్థ్యం 317 మెగావాట్లకు చేరిందని సీఎండీ తెలిపారు.
మిగిలిన ఇళ్లలోనూ త్వరితగతిన సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సోలార్ వెండార్లు అవసరమైన సదుపాయాలు సమకూర్చుకుని ఇన్‌స్టాలేషన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అర్హులైన వినియోగదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించి, దరఖాస్తు నుంచి సోలార్ వ్యవస్థ ఏర్పాటు వరకు సహకారం అందించాలని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ హెచ్‌ఆర్ టీవీఎస్ఎన్ మూర్తి, సీజీఎం ప్రాజెక్ట్స్ కె. లింగమూర్తి, సీజీఎం ఐపీసీ విజయ్ కుమార్, ఎనిమిది జిల్లాల అధికారులు, సోలార్ వెండార్లు పాల్గొన్నారు.