-పంటల బీమాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి
-ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టాలకు ఆర్థిక భరోసా – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర అనుకోని కారణాల వల్ల పంట దిగుబడిలో నష్టం సంభవించినప్పుడు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రబీ 2026-27 సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
విజయవాడ కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా స్థాయి పంటల బీమా పథకం పర్యవేక్షణ కమిటీ సమావేశం వ్యవసాయ శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించడం జరిగింది. ఈ పథకాల కింద ఎన్టీఆర్ జిల్లాలో రబీ 2026-27 సీజన్‌కు మూడు పంటలను పి ఎం ఎఫ్ బి వై కింద, ఒక పంటను ఆర్ డబ్ల్యు బి సి ఐ ఎస్ కింద నోటిఫై చేయడం జరిగింది.
పి ఎం ఎఫ్ బి వై పథకం కింద నోటిఫై చేసిన పంటలు:
1. వరి – గ్రామాన్ని బీమా యూనిట్‌గా పరిగణిస్తారు.
2. మొక్కజొన్న – మండలాన్ని బీమా యూనిట్‌గా పరిగణిస్తారు.
3. శనగ – జిల్లాను బీమా యూనిట్‌గా పరిగణిస్తారు.
ఈ పథకాన్ని జిల్లాలో టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అమలు చేస్తుంది.
అలాగే ఆర్ డబ్ల్యు బి సి ఐ ఎస్ పథకం కింద.. మామిడి పంటను మండల స్థాయి బీమా యూనిట్‌గా నోటిఫై చేయగా, దీనిని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అమలు చేస్తుంది.
పంటల బీమా నమోదుకు చివరి తేదీలు:
వరి మినహా ఇతర పీఎం ఎఫ్ బి వై నోటిఫైడ్ పంటలు మొక్కజొన్న, శనగలకు డిసెంబర్ 15, 2026, వరి, మామిడి పంటలకు డిసెంబర్ 30,2026 చివరి గడువులుగా నిర్ణయించడం జరిగిందన్నారు.
ఎకరాకు రైతులు చెల్లించవలసిన ప్రీమియం వివరాలు:
వరి పంటకు రూ.126/- లు,
మొక్కజొన్న పంటకు రూ.126/- లు, శనగ పంటకు రూ.56/- లు, మామిడి పంటకు రూ.2,050/- లు.
ఈ పథకంలో భూమి యజమానులు, కౌలు రైతులు, కౌలుదారులు అర్హత నిబంధనలకు లోబడి నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. రుణాలు పొందిన మరియు రుణాలు పొందని రైతులందరికీ పంటల బీమా నమోదు పూర్తిగా స్వచ్ఛందమని తెలిపారు. పీఎం ఎఫ్ బి వై కింద పంట కోత ప్రయోగాల ద్వారా దిగుబడి ఆధారంగా, ఆర్ డబ్ల్యు బి సి ఐ ఎస్ కింద నోటిఫై చేసిన వాతావరణ ప్రమాణాలు మరియు పథక నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని వివరించారు. ఈ పథకంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా రుణాలు పొందని రైతులను గుర్తించి, అర్హత కలిగిన ఆసక్తిగల రైతులందరూ గరిష్ట సంఖ్యలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులందరూ నిర్దేశించిన గడువులోగా పంటల బీమా పథకంలో నమోదు చేసుకుని ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి ఆర్థిక రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఖరీఫ్ సీజన్లో 2,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న మినుము పంటను కూడా రాబోయే ఖరీఫ్ 2027 సీజన్‌కు పీఎం ఎఫ్ బి వై పథకం క్రింద నోటిఫైడ్ పంటల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.నరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి సిహెచ్ తిరుమలాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటసుబ్బయ్య, జిల్లా ఉద్యానవన అధికారి పి.బాలాజీ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, జిల్లా నాబార్డ్ మేనేజర్, టాటా ఏఐజి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు వి.సతీష్, వి.రాజు, ఏ.సాయి మనోజ్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు, గరికపాడు డాక్టర్ కె.ఎల్. రావు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, అమరావతి వాతావరణ కేంద్రం అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
