అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాజ్యాంగపరమైన, పరిపాలనాపరమైన కేసుల విచారణలో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ తనదైన ముద్ర వేశారని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. జస్టిస్ లిబర్హాన్ మృతికి సంతాపంగా సోమవారం ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.
జస్టిస్ లిబర్హాన్ న్యాయవాదిగా ప్రారంభించి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని జస్టిస్ లీసా గిల్ గుర్తుచేశారు. 1992 అయోధ్య బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్కు 17 ఏళ్లపాటు నేతృత్వం వహించి 2009లో నివేదిక సమర్పించారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభునాథ్ వాసిరెడ్డి తదితరులు ఆయన న్యాయరంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సేవలు చిరస్మరణీయం
