-నిత్యం ప్రజాసేవలో తరించే నాయకులు మల్లాది విష్ణు
-అభినందన సభలో పలువురు వక్తలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందన సభ ఆదివారం ఘనంగా జరిగింది. గాయత్రీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సత్యనారాయణపురంలోని గాయత్రీ కళ్యాణ మండపం వేదికైంది. తొలుత వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించి.. బ్రహ్మశ్రీ జస్టిస్ బులుసు శివ శంకరరావు చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారి రాజకీయ జీవితంపై రూపొందించిన వీడియో ఆకట్టుకుంది. అనంతరం పలువురు వక్తలు మల్లాది విష్ణు సేవలను కొనియాడారు. రాష్ట్ర రివర్స్ టెండరింగ్ కమిటీ చైర్మన్, జస్టిస్ బులుసు శివ శంకరరావు మాట్లాడుతూ.. ప్రజాసేవకు పునరంకితం అయ్యే ప్రతి ఒక్కరూ రాజేనని.. అటువంటి కొద్దిమందిలో విష్ణు అంశ సంభూతులు మల్లాది విష్ణు అని పేర్కొన్నారు. కనుకనే ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమవుతూ దినదినాభివృద్ధి చెందుతున్నారన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పేలోగా.. గుండె చప్పుడు విని పరిష్కరించే గొప్ప మనస్తత్వం ఆయన సొంతమని కీర్తించారు. ప్రజాప్రతినిధిగా విశిష్ట సేవలు అందించటమే కాకుండా.. మల్లాది వేంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఎన్నో రకాల సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆయన ఏ పదవిని అలంకరించినా.. ప్రజాసేవలోనే తరించారన్నారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షునిగా మల్లాది విష్ణుని నియమించడం మనందరికీ గర్వకారణమన్నారు. విజయవాడ జనుల బలమైన ఆకాంక్ష, దుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. మల్లాది విష్ణుని సన్మానించుకోవటమంటే మనల్ని మనం సత్కరించుకోవటమేనని వ్యాఖ్యానించారు. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల విష్ణుని కన్న తల్లిదండ్రులు ధన్యజీవులన్నారు. రాబోయే రోజులలో భగవంతుని ఆశీస్సులతో ఆయనకు డాక్టరేట్ కూడా వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు.
అనంతరం రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి తొలి నుంచి వైఎస్ఆర్ సీపీ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడించారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు బ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. మరలా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. గడిచిన మూడేళ్ళలో ఈ సామాజిక వర్గానికి రూ. 400 కోట్ల నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా ప్రతినెలా 49 వేల మందికి క్రమం తప్పకుండా పెన్షన్ అందించటం జరుగుతోందన్నారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకోవటమే కాకుండా.. అనేక కీలక పదవీ బాధ్యతలు అప్పగించారన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి బ్రాహ్మణ సామాజికవర్గం ఎప్పటికి రుణపడి ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో గాయత్రీ సొసైటీ అధ్యక్షులు డా. గంటి ఈశ్వర్, నాయకులు వై. లోకనాథ శర్మ, కొప్పవరపు బలరాం, టి. వి. ఎస్. శర్మ, ఎస్. హనుమంత శర్మ, ప్రసాద రావు, డా. రాణి నరసింహ శాస్త్రి, ఎస్. రామలింగమూర్తి, పి. లక్ష్మణరావు, బి. వి. ఎస్. చలపతిరావు, శర్వాణి మూర్తి, డా. ధూళిపాళ్ళ రామకృష్ణ, డా. చల్లా హరికుమార్, దూబగుంట శ్రీనివాస్ రావు, జె. కె. సుబ్బారావు, జి. వి. ఎస్. శర్మ, డా. నోరి సూర్యనారాయణ, అన్ని డివిజన్ల వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, వివిధ రంగాలలోని ప్రముఖులు పాల్గొన్నారు.