విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ది.26.09.2022 వ తేదీ నుండి ది.05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా ఉత్సవాల వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో నగరానికి విచ్చేసే భక్తులు మరియు యాత్రికుల భద్రత దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.
దసరా బందోబస్తు సందర్భంగా వివిధ జిల్లాల నుండి విధులు నిర్వహించడానికి వచ్చిన సిబ్బంది మరియు అధికారులకు ది.25.09.2022వ తేదీన జ్యోతి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., దసరా బందోబస్త్ విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు మరియు సలహాలను అందించి దిశానిర్ధేశం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా వేడుకలకు ప్రత్యేక విశిష్టత, ప్రాధాన్యతలు ఉన్నాయని, దసరా ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు నగరానికి విచ్చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో రోటీన్ బందోబస్త్ లాగా కాకుండా కొంత మనసు పెట్టి శ్రద్ధతో బందోబస్తు విధులు నిర్వహిస్తే భక్తుల మన్ననలతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. యూనిఫాంలో విధులు నిర్వహించే సమయంలో ఇతరులు మనల్ని గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని, బందోబస్తు నిర్వహించే సందర్భంలో పాటించాల్సిన మార్గ దర్శకాలు, విధి నిర్వహణలో వ్యవహరించే తీరును ప్రతి ఒక్క పోలీసు అధికారి మరియు సిబ్బంది తెలుసుకోవాలన్నారు. మూడు షిఫ్టుల్లో బందోబస్తు విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మరింత సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో గానీ మరియు వి.ఐ.పి.లతో గానీ వివాదాలకు తావులేకుండా సమన్వయం చేసుకోవాలని, ఇటువంటి బందోబస్తుల్లో సమన్వయంతో వ్యవహరిస్తే అమ్మవారి దర్శనం సజావుగా సాగుతుందన్నారు. అలాగే దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి అధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కూడా వారితో మర్యాదగా వ్యవహరిస్తూ సక్రమంగా అమ్మవారి దర్శనం అయ్యేలా చూడాలని, అదే సమయంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు మరియు తోపులాటలు తదితర దురదృష్టకర సంఘటనలకు ఆస్కారం లేకుండా క్యూలైన్లలో భక్తులు సక్రమంగా కదిలేలా కృషి చేయాలన్నారు.
బందోబస్తు సందర్భంగా నిర్దేశించిన ప్రదేశంలో విధులు నిర్వహించడంతో పాటు రిలీవర్ వచ్చే వరకు పాయింటు వదలి వెళ్ళకూడదని సిబ్బందికి తెలియజేశారు. బందోబస్తులో ప్రధానపాత్ర వహించే సెకార్డ్ ఇన్ ఛార్జ్ లు అప్పటికప్పుడు జరిగే సంఘటనలను అంచనా వేసి చురుగ్గా వ్యవహరించాలన్నారు. అలాగే సిబ్బందికి ఏవైనా అనుమానాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత సెక్టార్ ఇన్ ఛార్జ్ కు లేదా పోలీసు ఉన్నతాధికారుల వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి టిఫిన్, బోజనం వారికి సమయానికి అందించడం జరుగుతుందని, బందోబస్తు సందర్భంగా మనస్ఫూర్తిగా పని చేస్తే ఉత్సవాలు విజయవంతం అవుతాయని తద్వారా ఆయా యూనిట్లతో పాటు పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్., డి.సి.పి. మేరీ ప్రశాంతి ఐ.పి.ఎస్., సి. ఎస్. డబ్ల్యూ డి.సి.పి ఉదయరాణి, పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, అడ్మిన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. పి.వెంకట రత్నం, ఎస్.బి. ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, ఎస్.ఈ.బి. జాయింట్ డైరెక్టర్ మోకా సత్తిబాబు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. టి. సర్కార్, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు బందోబస్తు విధులకు హాజరైన సుమారు 5000 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.