-24 గంటలూ అప్రమత్తంగా ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు.. నిషిద్ధ వస్తువుల తరలింపుపై ఉక్కుపాదం
-వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో ఎన్నికల వ్యయ నిర్వహణ ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ
వత్సవాయి/పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్ బుధవారం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ నిర్వహణ కోసం క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన అకౌంటింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్, వీడియో సర్వెలెన్స్ టీమ్ పనితీరును ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి సమీక్షించారు. నిషిద్ధ వస్తువుల తరలింపుపై నిఘా కొరకు ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి కేంద్రాల్లో ప్రతిరోజూ రిజిస్టర్లను తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నగదు, మద్యం, కానుకలు వంటి నిషిద్ధ వస్తువుల తరలింపు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తూ, సరిహద్దులు, ప్రధాన కూడళ్లు, ప్రవేశ మార్గాల్లో నిఘాను మరింత పెంచాలన్నారు. అకౌంటింగ్ టీమ్ అభ్యర్థుల రోజువారీ ఖర్చులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ‘షాడో రిజిస్టర్’ నిర్వహించాలన్నారు. అభ్యర్థులు తమ వ్యయ రిజిస్టర్లను నిర్ణీత గడువులోగా బృందానికి సమర్పించేలా చూడాలన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు ఎంఆర్ఓ జారీ చేసే అనుమతుల వివరాలను వెంటనే ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి బృందాలకు తెలియజేయాలన్నారు. తద్వారా ఆ కార్యక్రమాలపై నిఘా ఉంచి, అభ్యర్థుల ఖర్చులను కచ్చితంగా లెక్కించాలన్నారు. మండల కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఫిర్యాదుల రిజిస్టర్ను నిర్వహించి, అందిన ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల నివేదికను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
