గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం మెరుగుకు ప్రతి ఒక్కరూ భాధ్యత తీసుకోవాలని, అందులో వ్యర్ధాల విభజన కీలకమని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో భాగంగా నగరంలో పెద్ద మొత్తంలో వ్యర్ధాలు వచ్చే హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ సంస్థల ప్రతినిధులకు, నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్, అడ్మిన్, ప్లానింగ్, ఎమినిటి మరియు శానిటేషన్ కార్యదర్శులకు అవగహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాధ్యత అని, ప్రజారోగ్యంలో నగర పరిశుభ్రతే కీలకమన్నారు. ప్రజల సహకారంతో వచ్చే ఏడాది స్వచ్చ సర్వేక్షణ్ లో గుంటూరు నగరానికి మంచి ర్యాంక్ వచ్చేలా కృషి చేద్దామన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్ధులకు వ్యర్ధాల విభజన, ప్రాధాన్యత, వ్యర్ధ పరికరాలతో ఉపయోగపడే వస్తువుల తయారి పై అవగాహన కల్గించాలన్నారు. స్వచ్చతా కే దోరంగ్ లో గుంటూరు నగరం రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం, దేశంలో 10వ స్థానంలో నిలిచిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని విద్యా సంస్థల్లో కంపోస్ట్ తయారికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సచివాలయాల వారీగా పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే సంస్థలతో సమావేశాలు ఏర్పాటు చేసి, వ్యర్ధాల విభజనపై అవగాహన కల్గించాలన్నారు. అలాగే నగరంలో ప్లాస్టిక్ వినియోగం నిషేదం అమలులో ఉన్నందున హోటల్స్, ఫంక్షన్ హాల్స్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వ్యర్ధాల సేకరణ మెరుగైందని, రోడ్ల మీద వ్యర్ధాలు వేసే వారి పై మరింత విజిలెన్స్ పెంచాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయ కార్యదర్శులు హోం కంపోస్ట్ తయారి చేయాలని, నేను కూడా హోం కంపోస్ట్ తయారీ చేస్తామన్నారు.
డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా దేశంలో ఉత్తమ స్థానంలో నిలబెట్టడానికి ప్రజా ప్రతినిధులు సంపూర్ణ భాగస్వామ్యం అవుతారన్నారు. సచివాలయాల్లో కార్యదర్శులు, వాలంటీర్లు ప్రజలకు ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను ఏవిధంగా విభజన చేసుకోవాలి, రోడ్ల మీద, కాల్వల్లో వేయడం వలన కల్గే నష్టాలను వివరించాలన్నారు.
అనంతరం వ్యర్ధాల విభజన, నిర్వహణ, కంపోస్ట్, గ్యాస్ తయారీ పై బెంగుళూర్ నుండి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్లు సబిత, నవీన్, ప్రవీణ్ కుమార్, హరిబాబులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పారిశుధ్య నిర్వహణలో మెరుగైన ప్రతిభ చూపిన కార్మికులు, కార్యదర్శులకు అభినందన పత్రాలు అందించారు.
కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, సిఎంఓహెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, బయాలజిస్ట్ మధుసూదన్, ఎస్.ఎస్.లు ఆనంద కుమార్, రాంబాబు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవీంద్ర నాయక్, శానిటరీ ఇన్సెపెక్టర్లు, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …