– బాల్యాన్ని కాపాడుతూ బంగారు భవితను అందిద్దాం
– ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందడుగు వేద్దాం
– ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు
– అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో బాల్య వివాహాలను బాగా కట్టడి చేస్తున్నామని.. మరింత సమష్టి కృషితో సామాజిక బాధ్యతగా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి, ప్రతి బాలబాలికకు విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన ఉజ్వల భవిష్యత్తును అందిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారత శాఖ బాలల పరిరక్షణ విభాగం, జస్ట్ రైట్స్, అసోసియేషన్ ఫర్ వలంటరీ యాక్షన్, చైల్డ్‌రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాల నిర్మూలనకు చేయీచేయీ కలుపుదామంటూ ప్రతిజ్ఞ చేశారు. చట్టాల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక ప్రచార సామగ్రిని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల విద్య, సాధికారతపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. బాల్య వివాహాలు బాలల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు, వారి విద్యాభ్యాసం, వ్యక్తిగత అభివృద్ధి, భవిష్యత్తు అవకాశాలకు ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేద్దామని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు, బాల్య వివాహాల వల్ల ప్రభావితమయ్యే వారికి చట్టపరమైన రక్షణలు కల్పించేందుకు బాల్య వివాహ నిషేధ చట్టం – 2006 అమల్లో ఉందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదనరావు మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనకు కమిషన్ విశేష కృషిచేస్తోందని, ఈ కార్యక్రమాన్ని గొప్ప ఉద్యమంగా తీసుకెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అవిద్య, ఆర్థిక పరిస్థితులు, అవగాహన లేమి, అభద్రత వంటివి బాల్య వివాహాలకు కారణమవుతున్నాయని.. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి కమిటీలు మొదలు ప్రతిఒక్కరూ క్రియాశీలం కావాలన్నారు. వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డా. బి.కీర్తి.. బాల్య వివాహాల నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల విశేష కృషితో పాటు వివిధ అధ్యయనాల్లోని ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. బాలికలకు నాణ్యమైన విద్యను అందించడం, వారి హక్కులను గౌరవించడం, ఆత్మవిశ్వాసంతో ఎదిగేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారత అధికారి రుక్సానా సుల్తానా బేగం, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబశివరావు, డీఎంహెచ్‌వో డా. ఎ.శ్రావణ బాబు, జిల్లా మైనారిటీ అధికారి అబ్దుల్ రబ్బానీ, అరవ రమేష్ (ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్), నవభారతి (బాలికల అభివృద్ధి అధికారి), వివిధ మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
