-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణపనులను వేగవంతం చేసి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లకు వివరించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవనలైన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినికులు డిజిటల్ లైబ్రరీలు, ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాల నిర్మాణపు పనుల ప్రగతిపై గురువారం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల పురోగతిని గౌరవ ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్లు, ప్రాధాన్యత భవన నిర్మాణాలపై మరింత దృష్టి పెట్టి నిర్థేశించిన గడువునాటికి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్టిఆర్ జిల్లాలో ఇంకనూ ప్రారంభించవలసిన భవన నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. సాంకేతిక పరమైన సమస్యలు ఎదురైతే తక్షణమే జిల్లా కలెక్టర్లు వాటిని పరిష్కరించి భవన నిర్మాణపు పనులకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు.
ఎన్టిఆర్ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 235 పూర్తయన్నారు. మరో 33 భవనాలను పూర్తి చేయవలసి ఉందన్నారు. డిసెంబర్ మాసాంతరానికి నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించి పనులను వేగవంతం చేశామన్నారు. 260 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గాను 241 భవన నిర్మాణాలు పూర్తయన్నారు. మరో 19 భవనాలను పూర్తి చేయవలసి ఉన్నాయని నిర్మాణాల పనులు వివిధ దశలలో ఉన్నాయని, డిసెంబర్ మాసాంతరానికి భవనాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. 239 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలకు గాను 219 భవనాలు ఇప్పటికే పూర్తయన్నారు. మిగిలిన 20 భవనాలకు సంబంధించి డిసెంబర్ మాసాంతరానికి భవనాలు పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జగనన్న స్వచ్చ సంకల్ప కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 288 గ్రామ పంచాయతీలలో సంపూర్ణ పారిశుద్ద్యం మెరుగు పరిచేందుకు 257 చెత్త నుండి సంపద తయారి కేంద్రాలు వినియోగంలో ఉన్నాయని, ఇంకనూ నిర్మించవలసిన 31 ఎస్డబ్ల్యుపిసిలకు సంబంధించి భూ సేకరణ తుది దశలో ఉందని కలెక్టర్ డిల్లీరావు పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌కు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, పంచాయతీరాజ్ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఇ వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జె.సునీత, సంబంధిత అధికారులు ఉన్నారు.