-కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చి చేతికి గాయం చేసుకుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్రకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసి ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజలపూడి ఆరుద్రను గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి యం హరికృష్ణ, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటాలు పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆరుద్ర ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఆమె నుండి వివరాలు తీసుకుని ప్రభుత్వం న్యాయం చేస్తుందనే ధైర్యం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, నగర పోలీస్ కమీషనర్‌లతో కలిసి ఆరుద్రను పరామర్శించడం జరిగిందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం రాయుడిపాలెం గ్రామానికి చెందిన రాజులపూడి ఆరుద్ర వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ గౌరవ ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించి మనస్థాపంతో బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో క్షణికావేశంలో చేతికి గాయం చేసుకోవడంతో రక్తస్రావం అవుతున్న ఆమెను హుటాహుటీనా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరుద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా వుందని వైద్యులు ఆమె చేతికి అయిన గాయానికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సంఘటనకు గల కారణాల గురించి ఆరుద్రను ప్రశ్నించగా తన కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ చేయడం జరిగిందని కొంత కాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగనేవుందని తిరిగి అనారోగ్యనికి గురై యదాస్థితికి రావడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాలలో వైద్య చికిత్సలు చేసినప్పటికి ఫలితం రాలేదన్నారు. వైద్యుల సూచనల మేరకు అమెరికాలో ఆధునాతన చికిత్స అందిస్తే కోలుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారన్నారు. కుమారై వైద్య ఖర్చుల కొరకు అమలాపురంలో ఉన్న తన ఆస్తులను 62 లక్షలకు అమ్ముకున్నానని ఆరుద్ర తెలిపిందన్నారు. శంఖవరం మండలం అన్నవరంలో తన ఇంటిని అమ్ముదామని ప్రయత్నిస్తే తన ఇంటికి ఇరువైపుల ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడడమే కాకుండా తనపైనే కేసులు పెడుతున్నారని తెలిపిందన్నారు. అమలాపురంలో ఉన్న మరో ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నిస్తే తన భర్త తరుపు బంధువులు న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నట్లు తెలిపిందన్నారు. ఆమెకు ఎదురైన ఇబ్బందులను 2020 సంవత్సరంలో జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసిందని జిల్లా ఎస్పీ పిర్యాధును స్థానిక పోలీస్ అధికారులకు పంపి సమస్యను పరిష్కరించాలని సూచించారన్నారు. 2022 ఆగస్టునెలలో కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు, ఇబ్బందులు పెడుతున్న శివయ్య, కన్నయ్యలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారని తెలిపిందన్నారు. ఈ ఎడాది మార్చి, ఏప్రిల్ మాసంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అన్‌లైన్ ద్వారా పిర్యాదు చేసినట్లు తెలిపారన్నారు.
ఆరుద్ర తన కుమారైకు విదేశాలలో వైద్య చికిత్సలు అందించలేకపోతున్నాననే బాధతో తన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించడం జరిగిందన్నారు. గత నెల 31వ తేదిన ఎ కన్వెషన్ హాల్ వద్ద కు ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతించలేదన్నారు. తిరిగి 2వ తేదిన అమె కుమారైతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి చెరుకుని అధికారులను కలవడం జరిగిందని, సమస్య కోర్టు పరిధిలో ఉందని పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారులు తెలిపారన్నారు. ముఖ్యమంత్రిని కలవలేకపోయాననే మానస్థాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందన్నారు.
తాను ఏనాడు తన కుమారై వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం కొరకు గాని ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేయలేదని కేవలం తనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని మాత్రమే అధికారులకు పిర్యాధు చేసుకోవడం జరిగిందన్నారు. 2018వ సంవత్సరంలో గ్రూప్`2 పరీక్షలలో ఉత్తీర్ణురాలునై ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక అయ్యాయని అప్పట్లో తన కుమార్తె ఆనారోగ్యం దృష్ట్యా ఉద్యోగంలో చేరలేకపోయానని ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మానవతాదృక్పదంతో తనకు మరొక అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆరుద్ర ఎదుర్కొంటున్న సమస్యలను, ఆరోగ్య పరిస్థితిని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆమెకు ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందనే భరోసా ఇచ్చి ధైర్యం చెప్పాలని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. 4వ తేది శుక్రవారం ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రత్యేకంగా ఆరుద్రను కలవనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు అన్నారు.