నందిగామ పంచాయతీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా నెట్టెం శ్రీ రఘురాం

నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులతో సమీక్ష.. సర్పంచ్ అభ్యర్థులు, గ్రామస్థాయి నాయకులతో సమావేశాలు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త:
నందిగామ నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాంను నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకుడిగా నియమించారు.
ఈ నేపథ్యంలో నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో నెట్టెం శ్రీ రఘురాం సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల పరిస్థితులు, మండలాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ నాయకులతోనూ ఎన్నికల పరిస్థితులపై వివరాలు పంచుకుని, సమన్వయంతో ముందుకు సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు.
గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులతో సమావేశమై గ్రామాల వారీగా ఎన్నికల పరిస్థితులు, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై సమగ్రంగా సమీక్షించారు.
కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, చందర్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు కోట వీరబాబు, వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామితో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా కొడవాటికల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దినేని సావిత్రి విజయాన్ని కాంక్షిస్తూ గ్రామ నాయకులు, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎన్నికల పరిస్థితులను సమీక్షించి, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, నాయకులు, కార్యకర్తల బాధ్యతలపై చర్చించారు.
కంచికచర్ల మండలం కీసర గ్రామ సర్పంచ్ అభ్యర్థి పరిటాల దివ్య విజయమే లక్ష్యంగా స్థానిక గ్రామ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మరో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం, గ్రామస్థాయి సమన్వయం, నాయకుల బాధ్యతలు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం పెంపొందించి, అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేస్తూ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నట్లు నెట్టెం శ్రీ రఘురాం తెలిపారు.