-ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జీవిత విశేషాలు, ఆయనతో ముడిపడిన అనుబంధాలను వివరిస్తూ పి.వి. మనోహరరావు రచించిన “పి.వి. ద్వయం – జీవనరేఖలు” గ్రంథాన్ని హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా, విశ్వయోగి విశ్వంజీ మహారాజు విశిష్ట అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు, పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు, ఫౌండేషన్ ట్రస్టీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, ఫార్మా కన్సల్టెంట్ ఉప్పలపాటి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, విద్యార్థి దశలో ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు పాఠశాల వద్ద పి.వి. నరసింహారావుకు స్వాగతం పలికిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. పి.వి. వ్యక్తిత్వం, సేవలు, ఆలోచనలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంలో ఈ గ్రంథం ఉపయోగపడుతుందని పలువురు పేర్కొన్నారు.
