మంగళగిరిలో ఘనంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల కార్తీక వన సమారాధన

-ఐదుగురు ఐఏఎస్ అధికారులు హాజరు.. 500 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది సందడి

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన వేడుకలు శనివారం మంగళగిరి ఎకో పార్క్‌లో ఘనంగా జరిగాయి. ఐదుగురు ఐఏఎస్ అధికారులు, 500 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ స్మరణ్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ సీఈఓ పద్మావతి పాల్గొన్నారు. ఏపీ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ సీఈఓ చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు.
ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించిన అనంతరం అధికారులు, ఉద్యోగులు మొక్కలు నాటారు. ప్రకృతి ఒడిలో వనభోజనాలు, ఆటపాటలు, క్రీడా పోటీలతో రోజంతా సందడి నెలకొంది. టగ్ ఆఫ్ వార్, నిమ్మకాయ-చెంచా పోటీ, గోళీల ఆట, ఖోఖో తదితర పోటీల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద గాయని గరివిడి లక్ష్మి తన ఆటపాటలతో అలరించారు.
క్రీడా పోటీల్లో విజేతలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్, కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు బహుమతులు అందజేశారు.
ఢిల్లీ నుంచి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్తీక మాసంలో ప్రకృతితో మమేకమై వన సమారాధన జరుపుకోవడం ఆనందదాయకమని, ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. మంత్రి నేతృత్వంలోని సంస్కృతి సేవాసమితి కార్యక్రమ నిర్వహణకు సహకారం అందించింది.
ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ వెంకటరమణ, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్, ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు ప్రసాద్, ఆహార భద్రత విభాగం సంయుక్త కమిషనర్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సాయి సుధీర్ తదితర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు హోదాలకు అతీతంగా ఒకే వేదికపై కలిసిమెలిసి పాల్గొనడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.