ఉద్యోగులను బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధం

-ప్రజాప్రతినిధులు తమ వైఖరిని మార్చుకోవాలి: ఎస్‌టీయూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ (ఎస్‌టీయూ) పేర్కొంది. ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఎమ్మెల్యే ఫోన్‌లో అసభ్య పదజాలంతో దూషించి, బెదిరించినట్లు వెలువడిన వార్తలు, ఆడియోపై ఎస్‌టీయూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఉద్యోగుల పట్ల ఇలాంటి వైఖరి ప్రదర్శించడం తగదని ఖండించింది.
ఎన్నికల విధుల్లో ఏవైనా తప్పులు జరిగినా, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ఉన్నతాధికారులకు లేదా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేకానీ ఫోన్‌లో దూషించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. ప్రశ్నించే హక్కు ఉందని, బెదిరించే అధికారం ఎవరికీ లేదని పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, బాధిత ఉపాధ్యాయుడికి రక్షణ కల్పించాలని ఎస్‌టీయూ డిమాండ్ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ తగిన భద్రత కల్పించాలని కోరింది. ఉద్యోగుల ఆత్మగౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.