ఏపీ సినీ పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ : మంథా శ్రీనివాస్

WhatsApp Image 2026 11 28 at 6.46.48 AM

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు సినీ కార్మికులు, సాంకేతిక నిపుణుల సంక్షేమానికి ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా 24 క్రాఫ్ట్స్ యూనియన్ల పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత సభ్యత్వ గుర్తింపు కార్డులు, బీమా సదుపాయం కల్పించనున్నట్లు ఛాంబర్ అధ్యక్షుడు మంథా శ్రీనివాస్ తెలిపారు.
నగరంలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో శనివారం నిర్వహించిన 24 క్రాఫ్ట్స్ యూనియన్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడం, స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం, స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాల అభివృద్ధికి కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సినీ రంగ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. ప్రసన్నకుమార్ వర్మ, లక్కరాజు రాధా రాజేశ్వరి మాట్లాడుతూ సినీ కార్మికులకు గుర్తింపు, ఉపాధి భద్రత కల్పించేందుకు ఉచిత సభ్యత్వ కార్డులు, బీమా సదుపాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని విభాగాల కార్మికుల వివరాలను నమోదు చేసి వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జనరల్ సెక్రటరీ వికె. రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో సమగ్ర డేటాబేస్ రూపొందిస్తామని తెలిపారు. తద్వారా స్థానిక ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు యువతకు సినీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి, అరకు, లంబసింగి, భవానీ ఐలాండ్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించాలని సమావేశంలో నిర్ణయించారు. షూటింగ్ అనుమతులను సులభతరం చేయడం, స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కృషి చేయాలని చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ తోట ఆంజనేయులు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎ. కృష్ణచౌదరి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎస్. అయ్యప్పనాయక్ మీనావత్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు తిరుపతి శోభారాణి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మట్టా లావణ్య, ఉప్పాల రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.