మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ

– ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యంగా మున్ముందుకు..
– మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సాహం
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు నిర్వహిస్తున్న సూక్ష్మ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసి, విస్తరించేందుకు ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ సంస్థకు చెందిన లింగ సమానత్వం, సమ్మిళిత నాయకత్వ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం గుంటపల్లిలోని రైజ్ కేంద్రంలో ‘వ్యాపార దార్శనికత, అభివృద్ధి’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ నండూరి అపర్ణారావు నేతృత్వంలోని శిక్షకుల బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు.
గుంటుపల్లి రైజ్ కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలకు నీతి ఆయోగ్ నివేదికలో గుర్తింపు లభించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. కుటుంబాల ఆర్థికాభివృద్ధితో పాటు సమాజ పురోగతిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 130 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వారి వ్యాపార నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించడం, నూతన వ్యాపార అవకాశాలను గుర్తించడం, వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన అంశాలపై శిక్షణ అందించారు. బి.వి. రావు వ్యాపార నిర్వహణలో మెరుగుదల, అభివృద్ధి అంశాలపై, టి. పద్మజ వ్యాపార వృద్ధికి అవసరమైన ప్రణాళికలు, అనుసంధానాలపై, సాహితి దివి వ్యాపారాభివృద్ధిలో అనుభవాలను కథనాల రూపంలో వివరించే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు మూడు నెలలపాటు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నారు. మహిళలు తమ ప్రస్తుత వ్యాపారాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు నూతన మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, వ్యాపార సంబంధాలను విస్తరించుకునేందుకు అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలు, మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సాహం లభించనుంది. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.