-ఆర్టీసీ హౌస్‌లోనే కార్యాలయం కొనసాగింపు.. ఒక్కరోజులో రుణ మంజూరుకు చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీఎస్ ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)లో ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి పాలకమండలి ఏర్పాటు చేసేందుకు ఉద్యోగులు సహకరిస్తే, సభ్యులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు హామీ ఇచ్చారు. డిసెంబర్ 22న జరగనున్న సీసీఎస్ ఎన్నికల నేపథ్యంలో శనివారం విజయవాడ సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విజయవాడ డిపో ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలకమండలి ఏర్పడిన వెంటనే సీసీఎస్ కార్యాలయాన్ని ఆర్టీసీ హౌస్‌లోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీసీఎస్ యాప్ ద్వారా ఆన్లైన్లో రుణానికి దరఖాస్తు చేసుకున్న సభ్యులకు ఒక్కరోజులోనే రుణం మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు కృషి చేయడంతో పాటు, ఆడపిల్లల వివాహాల కోసం ప్రత్యేకంగా ‘పెళ్లి కానుక’ పేరుతో రుణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. సభ్యులకు వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఆర్టీసీలో ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలతో అడ్డుకుంటామని దామోదరరావు పేర్కొన్నారు. సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు. డిసెంబర్ 22న జరిగే సీసీఎస్ ఎన్నికల్లో విజయవాడ డిపో నుంచి ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.డి. ప్రసాద్, ఉపాధ్యక్షురాలు టి.వి. భవాని, రాష్ట్ర కార్యదర్శి జి.ఎస్. నారాయణ, సహాయ కార్యదర్శి ఎస్.ఎస్. నారాయణ, ఇతర రాష్ట్ర, జోనల్, జిల్లా, డిపో స్థాయి నాయకులు, గ్యారేజ్ కమిటీ సభ్యులు, విజయవాడ డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
