విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రైల్వే డివిజన్లో దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రశ్నించే దళితుల్ని అనగద్రోకుతున్నరని చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి చిట్టి రాజు అన్నారు. గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా దళితులకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని విచారం వ్యక్తం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్లో మూడు వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. క్రమశిక్షణ చర్యలు అంటూ దళిత ఉద్యోగులపై లేనిపోని ఆరోపణలు విధించి, వారి పదోన్నతులకు, బదిలీలకు గండి కొడుతున్నారని ఆరోపించారు. ఇదే సాకుతో వారికి లభించే బెనిఫిట్స్ ను అందకుండా చేస్తున్నారని విమర్శించారు. 2020 వ సంవత్సరములు జరిగిన ఎస్సీ ఎస్టీ యూనియన్ ఎన్నికలలో డివిజినల్ అధ్యక్షులుగా జక్కుల రాజు కిషోర్ ఎన్నిక అయ్యారు. రాజకిషోర్ కి కొన్ని అనారోగ్య సమస్యలను సాకుగా చూపించి నిబంధనలకి విరుద్ధంగా కొందరు మరొక వ్యక్తిని యూనియన్ కి తాత్కాలిక అధ్యక్షులుగా నియమించారు. అలానే ఈయనను నగరంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అదేమని ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతున్నారని, ఒక డివిజన్ స్థాయి యూనియన్ ప్రతినిధిని నిబంధనలను పాటించకుండా బదిలీ చేశారని తెలియజేశారు. డివిజన్ స్థాయి యూనియన్ నాయకులకే ఇలాంటి అవమానం జరుగుతుంటే అధికారులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, దీనిని బట్టి ఎస్సీ ఎస్టీ ప్రతినిధులను ఎంత చులకనగా చూస్తున్నారో అర్థమవుతుందని ఆవేదన చెందారు. ఎస్సీ, ఎస్టీ యూనియన్ ని నిర్వీర్యం చేయటానికి, దళిత ఉద్యోగులను బలహీనపరచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షునికి న్యాయం చేయాలని, బదిలీని రద్దు చేయాలని, తాత్కాలికం గా నియమించిన యూనియన్ అధ్యక్షుని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష కైన వెనుకాడమనీ చిట్టిరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రెజరర్ జె స్వామి రాజు తదితరులు పాల్గొన్నారు.