-జనసేన మైనార్టీ నాయకులు గయాజుద్దీన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురంలోని గాలిబ్ షాహిద్ దర్గా విషయంలో రాజకీయ పక్షాల జోక్యం సరికాదని జనసేన నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ (ఐజా) హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6వ తేదీన ముజావర్లు దర్గా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, ఆ కమిటీ కొనసాగడమే న్యాయమని ఆయన అన్నారు. దర్గా కమిటీ విషయంలో పశ్చిమ నియోజకవర్గం రాజకీయ పార్టీల నాయకులు జోక్యం చేసుకోవడం సరైనది కాదని అన్నారు. దర్గా కమిటీ ఎన్నికపై జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్ దూరంగా ఉండటం మంచిదని అన్నారు. గతంలో నాటి శాసనసభ్యులు జలీల్ ఖాన్ ,అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలో నాటి పాత కమిటీని విమర్శించిన పోతిన మహేష్ ఇప్పుడు పాత కమిటీని వెనకేసుకు రావడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఆ విషయంలో మీకు లాభం ఏంటని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల దర్గా కమిటీల విషయంలో సంబంధిత అంశాలను ముజావర్లుకు వదిలేయడం ఉత్తమమని, వారి సమస్యలను వారే పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. ఇకనైనా ముస్లిం మైనార్టీల కమిటీల విషయంలో రాజకీయ పార్టీలు అనవసరంగా జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని సూచించారు.