– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 76.10 లక్షల విలువైన రోడ్లకు ప్రారంభోత్సవాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని నందనవనంలా తీర్చిదిద్దుతామని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 23 వ డివిజన్ లో రూ. 76.10 లక్షల నిధులతో నిర్మించిన రహదారులను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నాడు-నేడు ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధిపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ.. మరమ్మతులకు గురైన రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో రోడ్లన్నీ తటాకాలను తలపించేవని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 100 కోట్ల నిధులతో సెంట్రల్లో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గోపరాజు రామచంద్రరావు, విష్ణువర్థనరావు వీధి, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, గోవిందరాజులు నాయుడు వీధులలో రహదారులను నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో మరింతగా కొనసాగుతుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, నాయకులు ఆత్మకూరు సురేష్, నాడార్స్ శ్రీను, అంజిబాబు, అన్సారీ, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.