-ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పధకం చివరి వ్యక్తి వరకూ చేరేలా కృషి
-అభివృద్ధి సంక్షేమ పధకాలు నూరు శాతం సక్రమ అమలుకు యంత్రాంగాన్నినడిపిస్తా
-సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందేలా కృషి చేస్తాను
-సిఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు సియంకు ధన్యవాదాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డా.సమీర్ శర్మ పదవీ కాలం నవంబరు 30వ తేదీతో పూర్తి కావడంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.జవహర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 2574 ద్వారా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సిఎస్ చాంబరులో సిఎస్ డా.సమీర్ శర్మ నుండి డా.కెఎస్.జవహర్ రెడ్డి సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా డా.కెఎస్.జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు సిఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.సిఎస్ గా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ స్థాయి వరకూ తీసుకువెళ్ళి చివరి వ్యక్తి వరకూ అందేలా అధికార యంత్రాంగాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తానని డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.అంతే గాక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలను మరింత పటిష్ట వంతంగా అమలయ్యేలా అన్ని విధాలా కృషి చేస్తానని సిఎస్.డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా 1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన డా.కెఎస్.జవహర్ రెడ్డి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవిఎస్సి)లో పట్టబధ్రులు కాగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో విశ్వవిద్యాలయం టాఫర్ గానే కాకుండా 6 బంగారు పతకాలను సాధించారు.సిఎస్.డా.జవహర్ రెడ్డి 1992-94 మధ్య నరసాపురం సబ్ కలక్టర్ గాను,1994-96 మధ్య భద్రాచలం పిఓ ఐటిడిఏగా,1996-98 మధ్య నల్గొండ జెసిగాను పనిచేశారు.అలాగే 1998-99 మధ్య హైదరాబాదు ప్రాధమిక విద్యా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గాను,1999-2002 మధ్య శ్రీకాకుళం జిల్లా కలక్టర్ గాను,2002-05 మధ్య తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ గాను,2005-2008 మధ్య హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సీవరేజ్ బోర్డు ఎండి గాను పనిచేశారు.అంతేగాక 2008-09 మధ్య హైదరాబాదు మెట్రోపాలిటన్ కమీషనర్ గాను,2009-2014 మధ్య సియంఓ కార్యదర్శి గాను పనిచేశారు.అదే విధంగా 2014-2019 మధ్య పిఆర్ అండ్ ఆర్డి కార్యదర్శిగాను,2019-2020 లో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి గాను,2020-2021 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి గాను పనిచేసి తదుపరి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
అంతకు ముందు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇఓ ఆధ్వర్యంలో పలువురు వేదపండితుల ఆశీర్వచనాల మధ్య డా.జవహర్ రెడ్డి సిఎస్ గా బాధ్యతలు చేపట్టారు.అలాగే భద్రాచలం రామాలయం వేద పండితులు కూడా ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్ధ ప్రసాదాలను అందించారు.
ఈకార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్,కరికల్ వలవన్, బి.రాజశేఖర్,ఎస్.ఎస్.రావత్,జి.సాయిప్రసాద్,ముఖ్య కార్యదర్శులు యం.టి కృష్ణబాబు,సిఇఓ ముకేశ్ కుమార్ మీనా,ముత్యాల రాజు,యం.రవిచంద్ర,పలువురు కార్యదర్శులు ఇంకా పలువురు ఉన్నతాధికారులు సిఎస్ డా.జవహర్ రెడ్డికి పుప్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంకా ఈకార్యక్రమంలో సచివాలయ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు,సిఎస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.