-విద్యార్ధులకు విద్యుత్ పొదుపు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఎనర్జీ క్లబ్‌లు చాలా ఉపయోగకరం
-కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ సహకారంతో ఏపీఎస్ఈసిఎం , రాష్ట్ర పాఠశాల విద్యా శాఖతో కలిసి ఎనర్జీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తుంది
-150 కంటే ఎక్కువ మోడల్ స్కూల్లు తమ పాఠశాలల్లో ఎనర్జీ క్లబ్‌లను ఏర్పాటు
-రాష్ట్రంలో ఇంధన పొదుపుకు ఎనర్జీ క్లబ్‌లు కూడా చాలా దోహదపతాయి
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యార్థులకు విద్యుత్ పొదుపు, ఇంధన వనరుల పరిరక్షణ మీద అవగాహన కల్పించే లక్ష్యం తో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం) రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర విద్యా శాఖ సహకారంతో ఇప్పటికే 150 పైగా ఆదర్శ (మోడల్)పాఠశాలల్లో ఈ ఎనర్జీ క్లబ్‌లను ఏర్పాటు చేసింది.
విద్యుత్ పొదుపు , సహజ ఇంధన వనరుల పరిరక్షణ లో విద్యార్థులను, భవిష్యత్ తరాలను భాగస్వాములను చేయటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఎనర్జీ క్లబ్‌ల ఏర్పాటు కోసం మొదటి దశ లో మోడల్ స్కూళ్లను ఎంపిక చేసుకోవటం జరిగింది. ఎనర్జీ క్లబ్ లో చేరిన విద్యార్థులకు విద్యుత్, ఇతర సహజ ఇంధన వనరులపై అవగాహన కల్పిస్తారు. ఇందు కోసం వ్యాస లిఖిత పోటీ , స్లోగన్ కాంపిటీషన్ , షార్ట్ వీడియో కాంపిటీషన్ వంటివి నిర్వహిస్తారు. ఈ కార్యకక్రమాల నిర్వహణ కు అవసరమైన నిధులను ఏపీఎస్ఈసిఎం ఆయా పాఠశాలలకు అందచేస్తుంది.
సదరు పాఠశాల ప్రధానోపాద్యాయులు, టీచర్లు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటట్లు చూడడమే గాక వివరాలను స్నేహితులు , కుటుంబ సభ్యులు , ఇరుగుపొరుగువారితో పంచుకుని అవగాహ కల్పించేలా వారికి తగిన మార్గదర్శకం చేస్తారు. మలిదశలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని పాఠశాలలో విస్తరించాలని ఏపీఎస్ఈసీఎం భావిస్తోంది.
విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్ధ వినియోగం పై పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని వినూత్న కార్యక్రమాలని చేపట్టాల్సిందిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఏపీఎస్ఈసిఎం కు సూచించారు. రాష్ట్రంలో ఇంధన భద్రత సాధించడం , 24 x 7 నాణ్యమైన విద్యుత్ సరఫరా ను బలోపేతం చేయటానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు .
ఈ లక్ష్యాల సాధనలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి గృహంలో విద్యుత్ పొదుపు, ఇంధన సమర్ధ వినియోగం పై అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .
ఎనర్జీ క్లబ్‌ల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్ సురేష్ కుమార్ , ఏపీ మోడల్ స్కూల్ సెక్రటరీ కె రవీంద్రనాథ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఏపీ ఎస్ ఈ సి ఎం అధికారులు తెలిపారు