– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో ఐదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ సమాజ స్థాపనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నందమూరినగర్లోని 1, 2, 3 , 4 వ లైన్లలో విస్తృతంగా పర్యటించి.. 145 గడపలను సందర్శించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రజల ఇంటి వద్దకే వస్తుండటంతో సుధీర్ఘకాలం స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సైతం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆయన.. నిర్ణీయ వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. చంద్రబాబు టీం గోబెల్స్ వారసులు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై అవాకులు, చెవాకులు పేలితో ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కించపరుస్తూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా నారా లోకేష్ సీఎం జగన్ పై అక్కసు వెళ్లగక్కుతుంటే.. అచ్చెన్నాయుడు, పయ్యావుల, యనమల వంటి వారు కలెక్టర్లు, అధికారులపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు పూర్తిగా గోబెల్స్ వారసులుగా మారిపోయారని.. పచ్చ మీడియాలో నీచ రాతలు రాయించుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైల్లో ఉంటేనే అన్ని రోగాలు, ఆరోగ్య సమస్యలు గుర్తుకొస్తాయని మల్లాది విష్ణు విమర్శించారు. దేవాలయాలను సందర్శించే ముందు అధికారంలో ఉండగా హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు బాబు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 23 దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంతో పాటు.. చెత్త తరలించే వాహనాలలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లిన దారుణ సంఘటనలను నగర ప్రజలు నేటికీ మరచిపోలేదని ఎమ్మెల్యే అన్నారు. పుష్కరాలలో చివరకు వాటర్ ప్యాకెట్స్ లో కూడా అవినీతికి పాల్పడి.. రూ. 3 వేల కోట్లు దోచుకుతిన్నారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రచార ఆర్భాటాలకు ఆనాడు బలైన 29 మంది కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఈ(ఇంజనీరింగ్) ప్రభాకర్ రావు, ఈఈ శ్రీనివాస్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, శోభన్, నేరెళ్ల శివ, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.