-31వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిష్పక్ష పాలనతో రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి సాధ్యం అయిందని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 31 వ ముత్యాలంపాడులోని 211 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయం వద్ద సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల బోర్డును ఆవిష్కరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. పల్లెల్లో 92 శాతం మంది ప్రజలకు, పట్టణాలలో అయితే 87 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చిన ఏకైక ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేనని చెప్పుకొచ్చారు. 211 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 6 కోట్ల 25 లక్షల 46 వేల 913 రూపాయల లబ్ధి చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 8 కోట్ల 34 లక్షల వేయి 179 రూపాయలు మేలు కలిగించినట్లు వెల్లడించారు. మొత్తంగా 14 కోట్ల 77 లక్షల 48 వేల 92 రూపాయల లబ్ధి కలిగించినట్లు వివరించారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా నవరత్నాలు వంటి ఒక్క కార్యక్రమాన్ని అయినా చంద్రబాబు చేపట్టగలిగారా..? అని సూటిగా ప్రశ్నించారు. కనుకనే ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాద బలం మెండుగా ఉందని.. రానున్న ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు టి.మురళీకృష్ణంరాజు, కంభం కొండలరావు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.