-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఐ.ఎ.ఎస్.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేజీబీవీల్లో బాలికా విద్యను ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి మనసారా, అంకితభావంతో కృషి చేయాలని అన్ని కేజీబీవీల్లో వంద శాతం సీట్లను భర్తీ చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఐ.ఎ.ఎస్., జీసీడీవోలను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం విజయవాడలోని సాల్ట్ కార్యాలయంలో అన్ని జిల్లాల జీసీడీవో (గర్ల్స్ చైల్డ్ డైవలెప్మెంట్ ఆఫీసర్)లతో కేజీబీవీల్లో వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేజీబీవీల్లో మౌలిక వసతుల ఏర్పాట్లు గురించి సివిల్ విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీడీ కేజీబీవీల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాల గురించి సమీక్షించి, 6వ తరగతి సంసిద్ధత కార్యక్రమం (రెడీనెస్ ప్రొగ్రాం) గురించి జీసీడీవోల ప్రణాళికల గురించి చర్చించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు బోధించని ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. హెడ్ క్వార్టర్లోనే ఉండి బాలికలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నాణ్యమైన విద్య, చక్కని భోజనం అందించేలా బాధ్యత వహించాలని అన్నారు. ఈ సమావేశంలో కేజీబీవీ సెక్రటరీ డి. మధుసూదనరావు, జాయింట్ సెక్రటరీ ఎన్. గీత, డిప్యూటీ డైరెక్టర్ ఎస్.డి.వి.రమణ, ఏడీ జి.నాంచారయ్య, సమగ్ర శిక్షా సీఈ కె.శ్రీనివాసరావు, ఈఈ రవీంద్రబాబు, స్టేట్ జీసీడీవోలు ఎస్.మాధురి, వై.ఉషారాణి, అన్ని జిల్లాల ఏఈలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వారీగా కేజీబీవీ విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.