విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తుఫాను,భారీ వర్షాలపై శనివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సిసిఎల్ఏ జి.జయలక్ష్మి తదితర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి శనివారం రాత్రికి విశాఖపట్నం-కళింగపట్నాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అందురూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని సిఎస్ ఆదేశించారు.పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఏలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం రాత్రి కూడా నిరంతరం కమాండ్ కంట్రోల్ నుండి సిఎస్ పర్యవేక్షణ….
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం నేపధ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం రాత్రి కూడా తాడేపల్లి విపత్తుల నిర్వహణ సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించ నున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ కూర్మనాధ్ తదితర అధికారులు పాల్గొన్నారు.