-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-ఇటీవల విజయవాడ వివంత హోటల్ లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ లో వచ్చిన ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరగా వాటిని పట్టాలెక్కించాలని మంత్రి దుర్గేష్ సూచన
-పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై సమీక్ష… వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
-త్వరలోనే పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు తెలిపిన మంత్రి దుర్గేష్.. స్వయంగా పర్యాటకాభివృద్ధి పనుల పర్యవేక్షిస్తానని వెల్లడి
-రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి దుర్గేష్
-అనంతరం మంత్రి దుర్గేష్ తో భేటీ అయిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్..సినిమాటోగ్రఫీ శాఖపై విస్తృత చర్చ..డీజీపీ ర్యాంక్ గా పదోన్నతి పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతిపై మంత్రి దుర్గేష్ సమీక్షించారు. 2024 డిసెంబర్ లో విజయవాడ వివంత హోటల్ లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ లో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి దుర్గేష్ సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మెండుగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, ఈ క్రమంలో త్వరితగతిన పనులు పూర్తి చేసి తమ శాఖ సమర్థతను నిరూపించుకోవాలని అధికారులను మంత్రి దుర్గేష్ ఆదేశించారు. త్వరలోనే పర్యాటక ప్రాంతాల్లో పర్యటనలు నిర్వహిస్తానని, పర్యాటకాభివృద్ధి పనుల తీరును స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ నేపథ్యంలో పనులపై మరింత దృష్టిసారించాలని అధికారులకు మంత్రి దుర్గేష్ సూచించారు.
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఒబెరాయ్, మేఫేర్, తాజ్ గ్రూప్, హయత్, మహేంద్ర, స్టెర్లింగ్ తదితర సంస్థల ప్రతిపాదనలపై మంత్రి దుర్గేష్ చర్చించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతిపాదనలు పరిశీలించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా వారికి కల్పించాల్సిన రాయితీలపై చర్చించారు. త్వరలోనే వారందరితో మరోసారి భేటీ అయి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు మంత్రి దుర్గేష్ ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 8 బీచ్ లను తొలుత అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బీచ్ ల్లో సుందరీకరణ, పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, బాత్ రూమ్ ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల అంశంపై చర్చ రాగా స్వచ్ఛ భారత్ లో భాగంగా బీచ్ ప్రాంతాల్లో క్లీనింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్థానికంగా ఉండే పెద్ద పారిశ్రామిక సంస్థలతో చర్చించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కోరాలని అధికారులకు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఆధునికీకరణ పూర్తి చేసుకుంటున్న టూరిజం హెటళ్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తమ తమ నియోజకవర్గాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాల వివరాలను శాసనసభ్యులు తీసుకొస్తే అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించే విషయంలో సినిమా రంగంలోని సెలబ్రెటీల సహాయ సహకారాలను తీసుకోవాల్సిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి నిధులతో చేపట్టే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులకు మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఉత్సవాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారులు మంత్రి దుర్గేష్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మంత్రి కందుల దుర్గేష్ తో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ భేటీ అయి సినిమాటోగ్రఫీ శాఖపై విస్తృతంగా చర్చించారు. నూతన ఫిల్మ్ పాలసీ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన కుమార్ విశ్వజీత్ ఇటీవల అదనపు డీజీపీ నుండి డీజీపీ ర్యాంక్ పదోన్నతి పొందిన సందర్భంగా మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో టూరిజం శాఖ సెక్రటరీ వినయ్ చంద్, ఐఏఎస్, టూరిజం ఎండీ ఆమ్రపాలి, ఐఏఎస్, టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు పద్మావతి, శేషగిరి, చీఫ్ ఇంజినీర్ నర్సింహారావు, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఈశ్వరయ్య, కన్సల్టెంట్ సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.