-వామపక్షాలతోనే ప్రత్యామ్నాయ పాలన
-సీపీఐ, సీపీఎం, ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించండీ
-నామినేషన్ల అడ్డగింతలు.. దాడులతో భయానక పరిస్థితులు.
-స్థానిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిని ఓడించండి
-చంద్రబాబు, పోలీసు, ఎస్ఈసీ మూడు కూటమిగా కుమ్మక్కు
-అల్లర్లు జరిగిన అన్నిచోట్ల తిరిగి ఎన్నికలు నిర్వహించాలి
-డీఐజీ కోయ ప్రవీణ్‌ను విధుల నుంచి తప్పించాలి
-మీడియా సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, వి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మోదీ, అమిత్‌షా అండదండలంతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఇష్టారాజ్యంగా దౌర్జన్యకాండ, హింసను సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రజలపై విశ్వాసం లేని కారణంగానే టీడీపీ నాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాలపై ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వానికి లొంగిపోయినప్పటి నుంచి టీడీపీ తన స్వతంత్ర రాజకీయ వైఖరిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీని ‘మోషా దేశం’గా అభివర్ణిస్తూ, ప్రజా సమస్యల కంటే అధికారాన్ని, డబ్బునే ఆ పార్టీ ప్రాధాన్యంగా భావిస్తోందన్నారు.
విజయవాడ దాసరి భవన్లో శుక్రవారం సీపీఐ, సీపీఎం నేతలు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు పరస్పర అవగాహనతో, రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల సర్దుబాటు చేసుకున్న ప్రాంతాల్లో ఉమ్మడిగా అభ్యర్థులకు మద్దతు ఇస్తాయని, దీంతో సీపీఐ, సీపీఎం, ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థలకు ఎన్నుకోవడం ద్వారా ప్రజలకు ప్రత్యామ్నాయ పాలన అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి, పోలీసు కూటమి, ఎన్నికల కూటమిలు మూడూ కుమ్మక్కై నిట్టనిలువునా ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డులోకి నగ్నంగా ఈడ్చారని మండిపడ్డారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, గూండాగిరి ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో వీడియోల సాక్షిగా తేటతెల్లమవుతోందని వివరించారు. ఏకంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులనే కిడ్నాప్‌లు చేయడం, నామినేషన్లకు అడ్డంకులు, నామినేషన్ల పత్రాల చించివేత ఘటనలు చూస్తుంటే..అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?, పాలన కొనసాగుతుందా? అనే గందరగోళం నెలకొందన్నారు. సీపీఐ, సీపీఎం, ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు పాల్పడటం, లోపలికి వెళ్లి పత్రాలు సమర్పించినా వాటిని లాక్కోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి గొప్పగా చెప్పుకుంటారని, ఆ అనుభవం ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి తప్ప, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి కాదన్నారు. సీఎం చంద్రబాబు మీడియా సమావేశాలు పెట్టి..ప్రజాస్వామ్యం గురించి వల్లించడం కాదనీ, ఆయన నియంతృత్వ పాలనకు స్థానిక సంస్థల నామినేషన్లలో కొనసాగిన హింసాత్మక, దౌర్జన్య చర్యలే నిదర్శనమని అన్నారు. ఇవే కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే..అసలు చంద్రబాబు ఎక్కడున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. 1995లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కమ్యూనిస్టులు పోషించిన పాత్రను మర్చిపోవద్దని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు నంద్యాలలో అరెస్టయినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఆయనకు అండగా నిలిచాయని, అలాంటి కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులపైనే ఇప్పుడు దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
కడపలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన సీపీఐ అభ్యర్థులను అడ్డుకోవడం, వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమని అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద సీపీఎం కార్యకర్తపై దాడి చేయడం వంటి ఘటనలు ఆందోళనకరమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని, ఇళ్ల పేరుతో మోసం చేశారని, పెన్షన్లలో కోతలు విధించారని, ధరలను నియంత్రించలేక పోయారన్నారు. నరసరావుపేటలో నామినేషన్ పత్రాన్ని చించివేసి, అది చెల్లుబాటు కాలేదనే ప్రచారం చేశారన్నారు.
కాకినాడ జిల్లాలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏకంగా సీపీఐ అభ్యర్థినే కిడ్నాప్‌కు జనసేన నాయకులు పాల్పడ్డారని మండిపడ్డారు. కడపలో ఎస్పీకి ఫోన్ చేసినా, మెస్సేజ్‌లు పంపినా స్పందన లేదని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు కనిపించడం లేదని అన్నారు. నామినేషన్ల అడ్డగింతలు, దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వెలుగులోకి వస్తున్నాయని, అయినప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కడప జిల్లాలోని ప్రాంతాల్లోను, తిరుపతి, మార్కాపురం, దాచేపల్లి, చిలకలూరిపేట తదితర ప్రాంతాలల్లో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగించారని చెప్పారు. తిరుపతిలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులపైన, మహిళలపైన దాడులకు పాల్పడ్డారన్నారు. గత ఎన్నికల్లో తాము కడప జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పోటీ చేసినప్పుడు తమ నామినేషన్లను ఈ విధంగా తిరస్కరించిన సందర్భాలు లేవని ఈశ్వరయ్య చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా అది ప్రజల తీర్పుతో సాధించిన ప్రజాస్వామ్య విజయం కాకుండా, అడ్డగింతలు, దాడుల ద్వారా సాధించిన బలవంతపు గెలుపుగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పే జనసేన నాయకులు ఈ ఘటనలపై స్పందించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరిస్తోందని, ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా నిర్వహించలేని పరిస్థితి ఉంటే ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు మొదలుకొని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం పోరాడుతున్నాయని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకగా పనిచేసే సీపీఐ, సీపీఎం, ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరుగుతున్న దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా టీడీపీకి కొమ్ముకాస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్‌ను విధుల నుంచి తొలగించాలన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని అన్ని మున్సిపాల్టీలు, పరిషత్ ఎన్నికల్లో తిరిగి ఎన్నికల ప్రక్రియను చేపట్టాలన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కనీస పరిపాలన సాగుతోందా?, లేదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా అన్ని జిల్లాల్లోను శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితులకు కూటమి నేతలే కారణమని ధ్వజమెత్తారు. సీపీఐ, సీపీఎంతోపాటు ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, పోటీ నుంచి తప్పుకునేలా బెదిరించడం, అభ్యర్థులను కిడ్నాప్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. స్థానిక కార్యకర్తలతో కాకుండా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో టీడీపీ దాడులు చేయిస్తుందని చెప్పారు. దాడులకు పాల్పడినవారు ఎవరో తమకు తెలియదని పోలీసులు చెబుతున్నారని, వీడియోల్లో దృశ్యాలు కనిపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వాటికి పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి సహకరిస్తోందని, నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. అధికార పార్టీ నేతల సూచనల మేరకు కొందరు అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియలో ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరించకపోతే తమకు పార్టీ టికెట్లు దక్కవనే భయంతో కొందరు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, స్వయంగా మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాల మేరకే ఈ పరిణామాలు జరగడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం మినహా ఇతర నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మార్కెట్లో అధిక ధరలకు చక్కెర, ఉప్పు, పప్పులు, మిర్చి, చింతపండు వంటి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి విస్తృతంగా పెరిగిపోయిందని, గల్లీ స్థాయి నుంచి అమరావతి వరకు అవినీతి కొనసాగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలోనూ పనులకు శాతాల రూపంలో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయన్నారు. స్థానిక సంస్థల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, ఇళ్ల స్థలాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని, ఎన్నికల ముందు ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామని హడావుడి చేయడం తప్ప, అర్హులైన వారందరికీ ప్రయోజనాలు అందించడం లేదని శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేవలం రాజకీయ పార్టీల మధ్య పోటీగా చూడకూడదని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశంగా భావించాలని సూచించారు. వామపక్షాలు బలపడితే ప్రజల తరఫున పోరాడే, అవినీతికి తావులేని స్థానిక స్వపరిపాలనకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు, దౌర్జన్యాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటర్లు భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోగలరా? అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, స్థానిక సమస్యల పరిష్కారానికి సీపీఐ, సీపీఎం అభ్యర్థులు, ఇండియా బ్లాక్ అభ్యర్థులకు ప్రజలు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
