మహిళా సాధికారతకు చారిత్రాత్మక ముందడుగు

-రాజకీయ ప్రాతినిధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ది మార్గదర్శక పాత్ర
-టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందుకు సాగాలన్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ స్వాగతించారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించే ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు ప్రాతినిధ్యం కల్పించే దిశగా తీసుకుంటున్న చర్యలు విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ చరిత్ర, స్పష్టమైన నిబద్ధత ఉన్నాయని విజయ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు పార్టీ ప్రాధాన్యతనిచ్చిందని గుర్తుచేశారు.
క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి అనుభవం జాతీయ స్థాయిలో మహిళా రాజకీయ భాగస్వామ్య విస్తరణకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఇది ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగిన విషయమని పేర్కొన్నారు.
మహిళా ప్రాతినిధ్యాన్ని కేవలం స్థానాల కేటాయింపునకు పరిమితం చేయకుండా, వారిని సమర్థ నాయకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. నాయకత్వ శిక్షణ, సామర్థ్య వికాసం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాల ద్వారా మహిళా ప్రజాప్రతినిధులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, తాగునీరు, జీవనోపాధి, సామాజిక సంక్షేమం వంటి రంగాల్లో మహిళల అనుభవం పాలనకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన మహిళలు సర్పంచులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులుగా ఎదిగి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని విజయ్ అన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే మహిళల్లోని నాయకత్వ ప్రతిభ సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
మహిళల క్రియాశీల భాగస్వామ్యం లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నది తెలుగుదేశం పార్టీ విశ్వాసమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించేందుకు విశేష కృషి చేశారని, నారా లోకేష్ మహిళలు, యువత సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ఆ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్లు కేవలం సంఖ్యాపరమైన ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా నిర్ణయాధికారంలోనూ సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలని విజయ్ ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల ప్రజా సమస్యలపై విస్తృత చర్చకు, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత లక్ష్యాలను ఆచరణలో సాకారం చేసేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నారీశక్తికి ప్రాధాన్యతనిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు.