విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి సమష్టి కృషి

-ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ చెన్నుపాటి కాంతిశ్రీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఎన్టీఆర్ సర్కిల్‌లో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ప్రత్యేక పూజల అనంతరం తమ ఛాంబర్లలో బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు వంగవీటి రాధాకృష్ణ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి తరహాలో విజయవాడను కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అమృత్ పథకం, 16వ ఆర్థిక సంఘం ద్వారా నగరానికి అధిక కేంద్ర నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంతో నగరపాలక సంస్థ ఆదాయ వనరులను పెంపొందిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వ సమన్వయంతో నగర అభివృద్ధిని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గతంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం, ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నాలకు అడ్డంకులు కల్పించడం వంటి అంశాలపై విమర్శలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
మేయర్ వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. డిప్యూటీ మేయర్ చెన్నుపాటి కాంతిశ్రీ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, బుద్ధా వెంకన్న, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.