రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో హై స్కూల్ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ

Samaram

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా హై స్కూల్ విద్యార్థులకు “వికసిత్ భారత్“ అంశంపై చిత్రలేఖనం పోటీ బెంజ్ సర్కిల్ వద్దనున్న నాస్తిక కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఆయన వెల్లడించారు. ఈ పోటీ 10గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు. భారతదేశ అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం, జాతీయ సమైక్యత, దేశ భవిష్యత్తుపై యువత ఆశయాలు వంటి అంశాలను విద్యార్థులు తమ చిత్రాల ద్వారా సృజనాత్మకంగా ఆవిష్కరించేందుకు ఈ పోటీ ఒక మంచి వేదికగా నిలుస్తుందని డాక్టర్ సమరం పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, కళాత్మక నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు దేశ భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రోత్సహించి, పెద్ద సంఖ్యలో ఈ పోటీలో పాల్గొనేలా పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు 8008123400ను సంప్రదించవలసిందిగా కోరారు.