-విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా పాఠశాల ప్రాంగణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక చిట్టూరి ఉన్నత పాఠశాలలో శనివారం (నవంబర్ 14) బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణాన్ని తలపించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి రాజీబ్ బరువా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను వెలికితీసి, విభిన్న రంగాల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు ఎన్. చెన్నకేశవులు, కార్యదర్శి డి. సుజాత, సంయుక్త కార్యదర్శి గోపు మురళీధర ఆర్య, కోశాధికారి ఎం. వరప్రసాద్, ప్రత్యేక పరిశీలకులు బి.వి. బాల కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ పి. హారిక, కమిటీ సభ్యులు పాల్గొని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘ఫెట్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల సహకారంతో స్వయంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లు, వినోదభరితమైన ఆటల స్టాళ్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ‘సిహెచ్ఎస్ గాట్ టాలెంట్’ వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గాన కార్యక్రమాలు, నటనా ప్రతిభకు ఆహూతుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచేలా ఏర్పాటు చేసిన ‘డీజే మ్యూజిక్ రూమ్’ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలతో విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో చిట్టూరి ఉన్నత పాఠశాల ప్రాంగణమంతా సందడి నెలకొంది. బాలల సృజనాత్మకత, ప్రతిభను ప్రోత్సహించేలా వేడుకలు విజయవంతంగా ముగిశాయి.
