విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవినీతి రహిత పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 24వ డివిజన్ లోని 91, 92 వార్డు సచివాలయాలను స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయాల్లో సిబ్బంది హాజరుతో పాటు సచివాలయ దస్ర్తాలను పరిశీలించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని.. పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని.. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రిజిస్టర్ లో ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
