Breaking News

చంద్రబాబుది కలల విజన్‌

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్.. ఓ కలల విజన్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారం ఐదేళ్ళే అని.. కానీ 2047 వరకు ప్రణాళికలతో బాబు ఊహా ప్రపంచంలో ఉంటూ నిర్వర్తించవలసిన బాధ్యతలను విస్మరిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పేదలకు విద్య అందని ద్రాక్షగా మారిపోయిందన్నారు. మెడికల్ కాలేజ్ లు, అమ్మఒడి అటకెక్కాయన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యం పాలైందని.. పేదల కోసం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం కనుమరుగయిందన్నారు. అలాగే పేదరిక నిర్మూలనలో నగదు బదిలీ ఏంతో కీలకమని.. అది చేయకుండా 2047 వరకు కలలు కనమని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇటువంటి ఊహాత్మక ప్రణాళికలతో ప్రజలకు కన్నీళ్లు తప్ప.. వారి జీవితాలలో ఎటువంటి మార్పు రాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబు చెప్పిన పది సూత్రాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. గతంలో చెప్పిన విజన్ 2020 ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. విజన్ పేరుతో ఆనాడు చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని ఎద్దేవా చేశారు. మరలా ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలపై ప్రజల దృష్టి మరల్చేందుకు పది సూత్రాలంటూ డ్రామాలాడుతున్నారన్నారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన గూర్చి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2016 డిసెంబర్ నాటికి ఏపీలో 11.77 శాతం ఉన్న పేదరికం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6.06 శాతానికి తగ్గిందని గుర్తుచేశారు. జనాభాలో 10 శాతం లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని నవరత్నాల పథకాల రూపంలో గత ప్రభుత్వం సాధించిందని.. ఆ పథకాలను రద్దు చేసి పేదల ద్రోహిగా బాబు మారారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రావడంతోనే 2.65 లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేసి.. ఉద్యోగ, ఉపాధి కల్పన అంటూ కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. నీటి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉత్త మాటలే అని.. ఏపీ ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు కుదించి బ్యారేజీగా మార్చిన ఘనత చంద్రబాబుది అని మల్లాది విష్ణు ఆరోపించారు. ఓ వైపు అన్నదాతల ఉసురుపోసుకుంటూ.. మరోవైపు చంద్రబాబు సాంకేతికత అంటూ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశామ‌ని.. కూటమి ప్రభుత్వం వచ్చాక పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంధన వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్న బాబు మాటలు ఒట్టి నీటి మూటలేనని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. రూ. 18 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారంతో రాష్ట్రంలో దాదాపు 50 లక్షల పేద కుటుంబాలను ఈ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిందని దుయ్యబట్టారు. సంపద సృష్టి అంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమేనా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త సేకరణ వాహనాలు కనిపించక నగరాలు, గ్రామాలలో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే.. చంద్రబాబు స్వచ్ఛాంధ్ర నినాదం ఎవరిని ఉద్ధరించడానికని నిప్పులు చెరిగారు. టెక్నాలజీ పేరుతో ఆడంబరాలకు పోతూ.. ఈ ప్రభుత్వం పేదలను ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు. మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పే బాబు, నాడు ఆర్భాటంగా ప్రకటించిన విజన్‌–2020 తో సాధించిందేమిటో..? సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలు, చిలక జోస్యాలు నమ్మటానికి మరోసారి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“యూ ట్యూబ్” న్యూస్ చానెళ్ల జర్నలిస్టులకోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో “యూ ట్యూబ్” న్యూస్ చానెళ్లు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నట్లు సి.ఆర్. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *