Breaking News

మొక్కల పెంపకంలో దేశంలోనే ప్రథమస్థానం సాధించాలి…


-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సూచికల్లో ప్రధమ స్థానం సాధించిన విధంగానే పచ్చదనం పెంపొందించే విషయంలో కూడా మన రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానం నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అంటే 20-7-2021న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణంపై రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై 13 జిల్లాల అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు, సమీక్షా సమావేశాల ద్వారా అందరి అభిప్రాయాలను సేకరించి తద్వారా గత వైఫల్యాలను సరిదిద్దుకుని వచ్చే రెండు నెలల్లో జగనన్న పచ్చతోరణం పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేసుకుని గణనీయఫలితాలను సాధించాలని ఆయన కోరారు. రికార్డులు సాధించడం కన్నా నాటిన మొక్కలు బతికేలా చేయడం ముఖ్యమని, నాటిన మొక్కలలో 83 % బతికేలా చేయడం గ్రామ సర్పంచ్ బాధ్యత అని అంటూ రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడంలో నిర్దేశించుకున్న లక్ష్యం 17వేల కిలోమీటర్లు – 68 లక్షల మొక్కలు పూర్తిచేసి ట్రాక్టర్ ద్వారా నెలకు నాలుగు తడులు పెట్టి 100 శాతం మొక్కలు బతికేలా చూడాలని, 41-1వేల రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి పరచాలని, లక్ష్యాలను అధిగమించి మొదటి మూడు స్థానాల్లో నిల్చిన జిల్లాల పిడి డ్వామాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం కార్యక్రమం ఉంటుందని అన్నారు. అలాగే లక్ష్యాలు సాధించని జిల్లాల అధికారులపై కఠిన చర్యలుంటాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రణాళికా బద్ధంగా, ప్రగతిశీలంగా ఆలోచించి పనులు చేయాలని, మంచి ఫలితాలను సాధించిన రాష్ట్రాలను జిల్లా పిడి డ్వామాలు సందర్శించి వారు అనుసరించించిన విధానాలను పరిశీలించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం ఇంటింటికీ తోరణంలా మారాలని, రాష్ట్రానికి శుభ సూచికంగా ఈ కార్యక్రమాన్ని మలుచుకోవాలని, నిత్య కృత్యంగా కాక స్ఫూర్తిదాయకంగా నిజాయతీ, నిబద్ధతతో పచ్చదనం పనులను పూర్తిచేయాలని అన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించి మొక్కలు నాటాలని, రిసార్ట్రిటీ అంటే ఎక్కడో కాదని అవి గ్రామాల్లోనే ఉంటాయని నిరూపించాలని, ఇతర శాఖల అనుసంధానంతో భూసారం, నీటి వనరులు, పచ్చదనం పెంచే పనులను చేపట్టాలని అధికారులు, అధికారేతరులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి మనసుకు నచ్చిన స్వచ్చ సంకల్పం, పచ్చతోరణం కార్యక్రమాలను అనుకున్నంత స్థాయిలో చేయాలని 13 జిల్లా అధికారులను కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కోరారు. అటవీ శాఖ పిసిసిఎఫ్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ పిల్లలను పెంచడం కన్నా మొక్కలను సంరక్షించడమే కష్టమని, నాటడం కాదు మొక్కను బతికించి చెట్టుగా మలచడం గొప్ప పని అని చెట్లు లేని కారణంగానే పకృతి వైపరీత్యాలు పెరిగాయని, నిబద్ధతతో పని చేసి అడవుల విస్తీర్ణ శాతం పెంచాలని కోరారు.

ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ఒక్కొక్క చెట్టు విలువ 75 లక్షల రూపాయలని అధ్యయనాలు చెప్తున్నాయని కాలుష్యం తగ్గించడానికి చెట్ల పెంపకం మార్గముని, గ్రామీణాభివృద్ధి శాఖ కోరినట్లయితే తమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.

ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధృడ సంకల్పమైన పచ్చతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని ఎప్పటికప్పుడు గ్రామస్థాయి నుంచి సమీక్షించుకుంటూ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఇజిఎస్ సంచాలకులు చినతాతయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డ్వామా పిడిలు వారి వారి జిల్లాలకు సంబంధించిన నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులు వెలిబుచ్చిన సందేహాలను ఉన్నతాధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ నవీన్ కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇఎన్.సి సుబ్బారెడ్డి, సెర్ప్ సిఇఒ రాజబాబు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ – అభివృద్ధి శివశంకర్, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివప్రసాద్, ఎ. కళ్యాణ చక్రవర్తి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Check Also

అమరావతికి కొత్తరైల్వే లైన్‌ మంజూరును స్వాగతిస్తున్నాం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతికి కొత్త రైల్వే లైన్‌ మంజూరు చేస్తూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *