– మంచి ఆలోచనలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది
– మనచుట్టూ ఉన్న గొప్పవారిని ప్రేరణగా తీసుకొని విద్యార్థులు ముందడుగు వేయాలి
– ఇన్నొవేషన్ ప్రాజెక్టులను ఇంక్యుబేషన్ చేసే ఆలోచనతో ఒప్పందాలు కదుర్చుకుంటున్నాం
– అభివృద్ధి వికేంద్రీకరణతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యత ఇస్తున్నాం
– ఇంక్యుబేషన్ మౌలిక వసతుల అభివృద్ధికీ ప్రభుత్వం కృషి
– రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉందని, విద్యార్థుల ఆలోచనలకు వాస్తవ రూపమిచ్చే ఫ్యాకల్టీ ఉందనే విషయం పాలీటెక్ ఫెస్ట్‌తో రుజువైందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మంగళవారం నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్స్‌లో జరుగుతున్న పాలీటెక్ ఫెస్ట్ (2024-25)లో మంత్రి పాల్గొని.. విద్యార్థుల టెక్ ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టు వివరాలను క్షుణ్నంగా తెలుసుకొని, విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రతి స్టాల్‌ను పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడుతూ వారి ప్రాజెక్టు ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు తయారీలో తీసుకున్న మెళకువలను, దానికి అయిన ఖర్చును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారు చేసిన పరికరాలు, వాటి పని తీరు, వాటిని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పాలీటెక్ ఫెస్ట్ అనేది 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని.. పిల్లలకు అద్భుత అవకాశాలు కల్పించాలని, వారిలో దాగున్న ప్రతిభను వెలికితీయాలనే ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదని.. ఈ ఏడాది టెక్ ఫెస్ట్‌లోని ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. అటానమస్ ఫెయిర్ డిటెక్షన్ అండ్ ఎక్స్‌ట్వింగిషర్ సిస్టమ్‌ను రూపొందించిన ఈశ్వర్, లక్ష్మీ శరణ్య పట్టుదల మిగిలిన విద్యార్థులకు ప్రేరణ అని పేర్కొన్నారు. ప్రయాణంలో ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయని.. వాటి నుంచి త్వరగా కోలుకోవడం అనేది ముఖ్యమన్నారు. దాదాపు 1,256 ప్రాజెక్టుల్లో 249 టాప్ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి టెక్ ఫెస్ట్‌లో ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆ విద్యార్థులందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అద్భుతమైన ఆలోచనలకు నిజ రూపమిచ్చి రూపొందించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు.
స్టీవ్ జాబ్స్ వంటి వారు తమ లక్ష్యం కోసం చేసే ప్రయాణంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా చివరికి విజయం సాధించారన్నారు. జోహో కార్పొరేషన్ శ్రీధర్ వెంబును మూడునాలుగుసార్లు తాను కలిశానని.. గతంలో ఐటీ శాఖమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిసి తిరుపతికి డెవలప్‌మెంట్ సెంటర్‌ను తీసుకొచ్చినట్లు వివరించారు. కేవలం పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ ఉన్నత ప్రతిభ ఉన్న పిల్లలు ఉన్నారని ఆయన అనేవారని.. వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లారన్నారు. ఇలా మనచుట్టూ అనేక మంది ఉన్నారని.. వారిని ఆదర్శంగా తీసుకొని మన సమాజం కోసం, మన కోసం, ప్రపంచంకోసం అవసరమైన ప్రొడక్ట్స్ తయారు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
మన ఐటీఐలు, పాలీటెక్నిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తయారుకావాలని.. దానికి మార్కెట్ లింకేజీ చాలాచాలా అవసరమని చెప్పానని.. అందులో భాగంగా దేశంలో అతిపెద్ద విండ్మిల్ మ్యానుఫ్యాక్చరర్ సుజ్లాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. కరిక్యులంతో పాటు రాబోయే రోజుల్లో ఇన్నొవేషన్ ప్రాజెక్టులను ఇంక్యుబేషన్ చేసే ఆలోచనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ విధంగా మేకిన్ ఇండియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇన్నొవేషన్ ఆలోచనలను ఇంక్యుబేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ ఫెస్ట్ అనేది ఒక ఈవెంట్ కాదు.. మూవ్‌మెంట్:
ఈ పాలీటెక్ ఫెస్ట్ అనేది ఒక ఈవెంట్ కాదని.. మూవ్‌మెంట్ అని మంత్రివర్యులు పేర్కొన్నారు. గౌరవ ప్రధాని చెప్పే మేడిన్ ఇండియా అనేది చాలాచాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాజధాని ఒకేదగ్గర ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. ఒక ఎకోసిస్టమ్ ఏర్పడాలనేది ప్రభుత్వ విధానమని.. అందుకే వెనుకబడిన అనంతపురం జిల్లాకు కియా మోటార్స్‌ను తీసుకొచ్చామన్నారు. ఇక్కడితో ఆగకుండా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామన్నారు. మరోవైపు కర్నూల్‌లో డ్రోన్‌హబ్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్స్ తయారీకి రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇలా ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఇంక్యుబేషన్ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ద్వారా ప్రతి మేజర్ జిల్లాలో నోడ్స్ ఏర్పాటుచేసి మంచి ఆలోచనలున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛాలెంజ్ అనేది జీవితంలో ఉండాలని.. దాంతోనే మనం జీవితంలో ఎదుగుతామని, అందుకు నా జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఓటములు ఎదురైనా నిలబడి నమ్మిన దానికోసం పోరాడాలని, హార్డ్‌వర్క్‌ను నమ్ముకోవాలని సూచించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను, ఆలోచనలకు ప్రభుత్వం మద్దతిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే అయిదేళ్లలో కనీసం ఒక్క యూనీకార్న్ కంపెనీ రాష్ట్రంలో రావాలనే ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు పదేపదే ఒక మాట చెప్పేవారని.. డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అని చెప్పేవారని, దీన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని మంత్రివర్యులు నారా లోకేశ్ అన్నారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్టులకు మంత్రి సర్టిఫికేట్లు, బహమతులు అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పాఠశాల, కాలేజీ విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు జి.గణేష్ కుమార్, సాంకేతిక శాఖ అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.