గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం అందించే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమస్యను సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ కి ప్రజల నుండి అందిన అర్జీల్లో నల్లచెరువు , లక్ష్మీ నగర్, సాయి నగర్, విద్యా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అర్జీదారులతో మాట్లాడి, సమస్యపై చర్చించి, పరిష్కార చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నల్లచెరువు 18వ లైన్లో అర్జీ అందిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించి, అర్జీదారుతో సమస్య గూర్చి మాట్లాడి, ఇంటింటి చెత్త సేకరణ ప్రతి రోజు నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని, రోడ్లకు ప్యాచ్ వర్క్ చేపట్టాలని ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నల్లచెరువు ప్రధాన రహదారిలో మేజర్ డ్రైన్ పై ఆక్రమణలు, అంతర్గత రోడ్లపైకి ర్యాంప్ లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, సదరు ఆక్రమణదారులకు స్వచ్చందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వాలని, గడువు అనంతరం తొలగించుకోని ఆక్రమణలను పట్టణ ప్రణాళిక దళం ద్వారా తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. లక్ష్మీ నగర్, సాయి నగర్ ల్లో పర్యటించి, వ్యాధికారక క్రిములకు ఆవాసంగా ఉన్నఖాళీ స్థల యజమానులను నోటీసులు ఇవ్వాలని, డ్రైన్ల నిర్మాణాలకు, ప్రస్తుతం ఉన్న డ్రైన్లకు కల్వర్ట్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. నల్లచెరువులోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రం వాతావరణం ఉండేలా చూడాలన్నారు. టిఫిన్ చేయడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తీసుకొని, క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్ లైన్ అప్ లోడ్ చేశారు. హిందూ కాలేజి సర్కిల్ నుండి ఈస్ట్ లూధరన్ చర్చి రోడ్ లో బిటి లేయర్ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
పర్యటనలో ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, డిఈఈలు మధుసూధనరావు, రమేష్ బాబు, ఏఎంహెచ్ఓ రాంబాబు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …