-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తరగతి గదులు మినీ ల్యాబ్స్ గా మారి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు విద్యార్థుల నుండి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. పెనమలూరు మండలం పోరంకి మురళి రిసార్ట్సులో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుంచి ఈ ప్రదర్శనను రాష్ట్రంలో ఎక్కువమంది విద్యార్థులు వీక్షించేలా నాలుగైదు రోజులు నిర్వహిద్దామన్నారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శన వరకు వచ్చిన ప్రతి ఒక్కరూ విజేతలేనని కొనియాడారు. విద్యార్థులు ఆవిష్కరించిన ప్రయోగాలను వీడియోలుగా ప్రతి పాఠశాలకు పంపే విధంగా ప్రణాళిక వేస్తున్నామన్నారు.
పాఠశాలలకు ఇచ్చిన ప్రతి రిసోర్సును ఉపయోగించాలని ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. సైన్స్ అనేది ఒక సబ్జెక్టు కాదు అది ఒక భాష, ఒక మీడియం అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రదర్శించిన అన్ని ప్రాజెక్టులు చాలా అద్భుతంగా విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయని ఎస్పీడీ అభినందించారు.
వ్యక్తిగత విభాగం నుంచి 15, బృంద విభాగం నుంచి 10 , టీచర్స్ విభాగం నుంచి 10 అద్భుత ప్రదర్శనలు ఎంపిక చేశారు. ఎంపికైన విజేతలు ఈనెల 20 నుంచి 25 తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగే దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని, అక్కడ కూడా అన్ని ప్రాజెక్టులతో చక్కని ప్రతిభ కనబరిచి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమ అధ్యక్షులు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సైన్స్ నోడల్ అధికారి ఆర్.భాగ్యశ్రీ, కంకిపాడు, పెనమలూరు మండల విద్యాశాఖాధికారులు, ఎస్సీఈఆర్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.