గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక సమస్యలపై ఎంతో అవగాహన కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ హెచ్ ఐ.వి ఎయిడ్స్ కంట్రోల్ అదనపు డైరెక్టర్ డా.సరస్వతి అన్నారు. గురువారం రెడ్ క్రాస్ కార్యాలయంలో మారుతి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కథల జాతీయస్థాయి పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సరస్వతి దేవి మాట్లాడుతూ హెచ్ఐవి వైరస్ వంటి వాటి మీద ప్రజలను జాగృతి పరుచుట కు కథలు మరియు కళారూపాల ద్వారా అవగాహన కలిగించి చైతన్య పరచవచ్చని తద్వారా ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఏర్పరచవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మారుతి మహిళా సొసైటీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారని, సొసైటీ చైర్మన్ సునీత గారు హెచ్ఐవి వైరస్ అవగాహన మీద జాతీయ కథల పోటీలు నిర్వహించి, ఔత్సాహిక కథా రచయితలకు బహుమతులు అందజేయడం ఆనందకరమని , వ్యసనములకు దూరంగా ఉంటూ ప్రజలు ఎయిడ్స్ పట్ల జాగ్రత్త వహించాలని పిలుపునిచ్చారు.
జాతీయ కథా పోటీలకు న్యాయమూర్తిగా వ్యవహరించిన ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ ఎయిడ్స్ వైరస్ బాధిత కుటుంబాలు వ్యాధి వలన సామాజికంగా అసమానతలకు గురై మానసికముగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారికి ఇటువంటి అవగాహన కథల వలన మానసిక ధైర్యము కలుగుతున్నదని, అదేవిధంగా ఈ కథల వలన ప్రజలను చైతన్య పరచి, ఆరోగ్య భారత్ కల సాకరం చేయవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి విజేత కరుణేషు దేవి కధా రచయిత టి. వెంకటప్పయ్య, ద్వితీయ బహుమతి విజేత రత్తాలు కథా రచయిత పివి శేషారత్నం , తృతీయ బహుమతి విజేత పరివర్తన కథ రచయిత M. శ్రీనివాసరావు లను మరియు ప్రోత్సాహక బహుమతులు పొందిన ముందు చూపు కథ రచయిత హైమావతి సత్య, చేతులు కాలాక కథ రచయిత డి.విశాలాక్షి, చీకటి దయ్యం కథ రచయిత ఎన్. ప్రవీణ్ కుమార్ లను అతిధులు బహుమతులు అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ రమణ యశస్వి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ పి రామచంద్ర రాజు, మారుతి మహిళా సొసైటీ అధ్యక్షురాలు లఖంరాజు సునీత, సినీ నటులు నాయుడు గోపి తదితరులు పాల్గొన్నారు.