తిరుప‌తి ఘ‌ట‌న నా మ‌న‌సును క‌ల‌చివేసింది…

– శ్రీ వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో ఎలాంటి అప‌శ్రుతీ జ‌ర‌క్కూడ‌దు..
– తిరుమ‌ల‌ను ప‌విత్ర‌మైన దివ్య‌క్షేత్రంగా ఎప్పుడూ నిల‌బెట్టాల‌న్న‌దే నా త‌ప‌న‌
– తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడే బాధ్య‌త నాది
– భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా స‌రైన నిర్ణ‌యాలు
– ఘ‌ట‌నపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తాం
– మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక స‌హాయం
– కాంట్రాక్టు ఉద్యోగాలూ ఇచ్చి అన్నివిధాలా ఆదుకుంటాం
– తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంది
– మీడియాతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుప‌తి సంఘ‌ట‌న చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న అని.. ఇది మ‌న‌సును క‌ల‌చివేసింద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. గురువారం టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో ఎప్పుడూ మ‌న‌సా వాచా ఎలాంటి అప‌శ్రుతీ జ‌ర‌క్కూడ‌దు.. ప‌విత్ర‌మైన దివ్య‌క్షేత్రంగా ఎప్పుడూ నిల‌బెట్టాల‌న్న‌దే త‌న తాప‌త్ర‌య‌మ‌ని.. ఓ భ‌క్తునిగా, ముఖ్య‌మంత్రిగా తిరుమ‌ల దివ్య‌క్షేత్ర ప‌విత్ర‌త‌ను కాపాడే బాధ్య‌త‌ను ఎప్పుడూ తీసుకుంటున్నాన‌ని.. ఇక‌పైనా తీసుకుంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
సంఘ‌ట‌న స్థ‌లాన్ని చాలా నిశితంగా ప‌రిశీలించి, ఆసుప‌త్రికి వెళ్లి అంద‌రితోనూ మాట్లాడాన‌ని.. కొంద‌రు త‌మ కుటుంబ స‌భ్యుల్ని, బంధువుల్ని, గ్రామ‌స్థుల్ని పోగొట్టుకున్న‌వారు ఉన్నారని.. వారితోనూ మాట్లాడిన‌ట్లు తెలిపారు. అనంత‌రం కార్యాల‌యంలో స‌మీక్షించామ‌ని, అన్ని కోణాల్లోనూ స‌మాచారం ఉంటే ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌ని తెలిపారు. బోర్డు ఛైర్మ‌న్‌, ఈవో, స‌భ్యుల‌కు కూడా స్ప‌ష్ట‌మైన ఆదేశాలిస్తున్నా. నిర్ణ‌యాల‌పై బోర్డులో చ‌ర్చించి, వాటిని అమ‌లుచేస్తారు. ఈ ప‌విత్ర క్షేత్రంలో అస‌మ‌ర్థ‌త‌తోగానీ, అనాలోచిత చ‌ర్య‌ల వ‌ల్ల‌గానీ చేసిన ప‌నుల వ‌ల్ల ప‌విత్ర‌త దెబ్బ‌తినే ప‌రిస్థితి రాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తెలిసిచేసినా, తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే. అంద‌రం క‌లిసి ఇక్క‌డ దేవునికి సేవ చేస్తున్నామ‌నే భావ‌న ఉండాలి. రాజ‌కీయాలు చేయ‌డానికి వీల్లేదు. రాజ‌కీయాల‌కు అతీతంగా శ్రీ వేంక‌టేశ్వ‌రునికి సేవ‌చేస్తున్నామ‌నే భావ‌న‌తో అంద‌రం ముందుకెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంది. భ‌క్తుల మ‌నోభావాల గురించి చెబుతూ కొండ‌పై ఉన్న‌ప్పుడు ఎంత‌సేపైనా క్యూలెన్ల‌లో ఉంటాం. స్వామివారిని త‌ల‌చుకుంటూ ఆయ‌న లీల‌లు గుర్తుచేసుకుంటూ దేవుని సేవ‌లో స‌న్నిధిలో ఉంటాం.. కానీ, తిరుప‌తిలో టోకెన్లు ఇవ్వ‌డం మాకు స‌రైందని అనిపించ‌డం లేద‌ని భ‌క్తులు చెప్పిన‌ట్లు ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

జ‌రిగిన సంఘ‌ట‌న‌పై విచారాన్ని వ్య‌క్తం చేస్తున్నా..
వైకుంఠ ఏకాద‌శి.. ద్వాద‌శి.. రెండు రోజులు ప‌విత్ర‌మైన రోజులు. అయితే ప‌దిరోజులు చేశారని, ఎందుకు చేశారో తెలీద‌ని, ఆగ‌మ శాస్త్రాలు అనుమ‌తిస్తాయో లేదో తెలీద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. వేంక‌టేశ్వ‌ర స్వామి వెల‌సిన‌ప్ప‌టి నుంచి ఏ సంప్ర‌దాయాలు పాటిస్తున్నామో ఆ సంప్ర‌దాయాల‌ను ఉల్లంఘించ‌డం క‌రెక్ట్ కాద‌నేది నా అభిప్రాయ‌మ‌ని తెలిపారు. జ‌ర‌గ‌రాని సంఘ‌ట‌న జ‌రిగిన‌దానికి విచార‌ణ‌ను, బాధ‌ను, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. అన్ని దేవాల‌యాల‌నూ స్ట్రీమ్ లైన్ చేసి ఎక్క‌డా అప‌చార‌మ‌నేది జ‌ర‌క్కుండా అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చి.. ప్ర‌సాదాల ద‌గ్గ‌రి నుంచి అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేస్తున్న సంద‌ర్భంలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ద‌ర్శ‌న ఏర్పాట్లు చేయాలని చాలా స్ప‌ష్టంగా చెబుతున్న‌ట్లు తెలిపారు.

ఘ‌ట‌న‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వ‌యిరీ:
ఘ‌ట‌న‌లో ఆరుమంది మ‌ర‌ణించార‌ని, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని, వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు త‌క్ష‌ణ‌మే ఆర్థిక స‌హాయం అందించ‌డం జ‌రుగుతుంద‌ని.. వారి కుటుంబ స‌భ్యుల‌కు కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని.. వీరికి రూ. 5 ల‌క్ష‌లు చొప్పున సాయ‌మందిస్తామ‌ని, 33 మందికి గాయాల‌య్యాయ‌ని వారికి రూ. 2 ల‌క్ష‌లు చొప్పున సాయ‌మందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. బాధ‌లో ఉన్న‌ప్ప‌టికీ స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే సంక‌ల్పం వారిలో ఉంద‌ని.. దాన్ని నెర‌వేర్చేందుకు 35 మందికీ శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేయిస్తామ‌ని తెలిపారు. వారికి అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హాకారాలు అందిస్తామ‌న్నారు. డీఎస్పీ ర‌మ‌ణ కుమార్ బాధ్య‌త లేకుండా ప‌నిచేశార‌ని, గోశాల డైరెక్ట‌ర్ హ‌ర‌నాథ్‌రెడ్డి కూడా జ‌వాబుదారీత‌నంతో ప‌నిచేయ‌లేద‌ని వెల్ల‌డైంద‌ని.. వీరిని స‌స్పెండ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఎస్‌పీ సుబ్బ‌రాయుడు, జేఈవో గౌత‌మి, సీఎస్‌వో శ్రీధ‌ర్‌ను త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఘ‌ట‌న‌పై జ్యుడీషియ‌ల్ ఎంక్వ‌యిరీ వేస్తున్నామ‌ని, వాస్త‌వాల‌ను అధ్య‌య‌నం చేసి, ప్ర‌భుత్వానికి రిపోర్టు ఇస్తార‌న్నారు. మేనేజ్‌మెంట్‌, ఎగ్జిక్యూటివ్స్‌.. ఇంకా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంద‌ని తెలిపారు. బోర్డు స‌భ్యుల‌తో స‌హా ప్ర‌తిఒక్క‌రూ సేవ‌కుల‌మ‌నే భావ‌న‌తో దేవుని సేవ చేయాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేశారు.

ఈ పాత్రికేయ సమావేశంలో మంత్రుల బృందం రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎం ఎల్సిలు, టీటీడీ బోర్డు సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *