Breaking News

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ
-రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి
-గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు
-టీడీఆర్ బాండ్ల దోషుల్ని శిక్షిస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-గుంటూరులో నారెడ్కో ప్రాపర్జీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
‘బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ఐదేళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నాం. అందుకే నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చా. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని కోరుకుంటున్నాను. నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
శుక్రవారం గుంటూరు స్థంబాల గురువు లోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ ( నారేడ్కో) , క్యాపిటల్ జోన్, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ నారేడ్కో ప్రోపర్టీ షో ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తో కలిసి ప్రారంభించి, ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ప్రారంభోత్సవ సభను ముఖ్యమంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిల్డర్ల ను ఉద్దేశించి మాట్లాడుతూ
ఎటు చూసినా విధ్వంసం…అంధకారమే కనబడింది
‘7 నెలల క్రితం వరకూ నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి. నిర్మాణ రంగమైతే గత ఐదేళ్లు అడ్రస్‌ లేకుండా పోయింది. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని నమ్మి 93 శాతం స్ట్రైక్ రేట్, 53 శాతం ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. గత ఐదేళ్లు ఎటు చూసినా అంధకారం…విధ్వసమే కనబడింది. ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రధాని మోదీ రూ.2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాండ్ ఏపీ ఇమేజ్‌తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి.

వ్యవసాయం, పర్యాటకం ఊపందుకోవాలి
‘రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, పర్యాటకం ఊపందుకోవాలి, సంపద పెరగాలి.. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డాయి. గత ఐదేళ్లు ఇసుక లభించక భవన నిర్మాణ రంగం కార్మికులకు సరైన ఉపాధి ఉండేది కాదు. మా ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఇసుక కొరత లేకుండా చేశాం. ఎవరైనా ఇసుక లభ్యం కాకపోతే.. గట్టిగా అడిగే హక్కు ఈ ప్రభుత్వం ఇచ్చింది. నరెడ్కో సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. రియలెస్టేట్ రంగం వాటా జీడీపీలో 7.3 శాతం ఉంది. 2047కు 20 శాతం పెరిగి, 5.8 ట్రిలియన్ డ్రాలర్లు ఆర్జిస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నాగరిక సమాజంలో నిర్మాణం అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ఈ ప్రాంతం మరింత నిలదొక్కుకుని ఉండేది. కానీ ఐదేళ్లు నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణాన్ని నిలదొక్కకోకుండా చేశారు. కూల్చివేతలతో భయబ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది. నిర్మాణ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేసి భూకబ్జాలకు పాల్పడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా చేయాలని చూశారు. అందుకే అధికారంలోకి వచ్చాక రద్దు చేసి, యాంటీ ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం.

టీడీఆర్ బాండ్ల దోషుల్ని వదిలిపెట్టం
‘టీడీఆర్ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు… నష్టపోయింది ఇంకొకరు. దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. అవినీతికి పాల్పడ్డవారిని వదలిపెట్టం… అమాయకుల్ని కాపాడతాం. 7 నెలల్లో రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. తద్వారా 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతి పనులను రూ.50 వేల కోట్లతో ప్రారంభిస్తాం. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్టు. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా పెద్దగా అమరావతి చుట్టూ 183 కి.మీ మేర రింగ్‌ రోడ్డుకు ప్లాన్ సిద్ధం చేశాం. అది పూర్తయితే గుంటూరు-అమరావతి పట్టణాలు కలిసిపోతాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చుతాం.

అవకాశాలన్ని అందుకోవడంలో ‘గుంటూరు’ ముందు
‘ఐటీని అందిపుచ్చుకుని విదేశాలకు వెళ్లిన వారిలో గుంటూరు వాసులు ఎక్కువ. అందరికంటే ముందుండే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇతర దేశాల్లో మాదిరి రాష్ట్రంలోనూ స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టిస్తాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను గతంలో గుంటూరులో ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా పని చేస్తోంది. ఇక ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వం చేస్తుంది… వాటిని మీరు ముందుకు తీసుకెళ్లాలి. నిర్మాణ రంగంలో మన రాష్ట్రాన్ని మించిన పాలసీ ఉండదు. వీలైనన్ని నిబంధనలు సరళతరం చేశాం. రాబోయే రెండు నెల్లలో డ్యాష్ బోర్డు తెస్తాం. మీరు తెచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తాం. నిర్ణీత సమయానికే అనుమతులు ఇస్తాం… ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడకుండా ఉండాలి. ఇప్పటిదాకా నిదానించిన నిర్మాణరంగాన్ని నిలబెడుతున్నాం.. ఇంకా మీరే నడవాలి… పరుగెత్తాలి. గతాన్ని మర్చిపోండి. నిర్మాణ రంగంలోనూ నూతన ఆవిష్కరణలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకుంటే రూ.500 సంపాదించేవాళ్లు రూ.1,500 సంపాదించవచ్చు.

దేశంలో అమరావతి లాంటి కొత్తనగరం రాదు
‘దేశంలో అమరావతి లాంటి నగరం మరొకటి రాదు. కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తాం. ఒక్క అమరావతినే కాదు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి లాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో పట్టణాభివృద్ధి జరిగి మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాలి. అనధికారిక నిర్మాణాలు చేపట్టవద్దు. ఇసుకను ఉచితంగా ఇస్తాం. ఎక్కడా ఇసుక అక్రమ రవాణాను అనుమతించం. దీనిపై ఇప్పటికే కలెక్టర్ల, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చాం. అధికారులు తప్పు చేసినా క్షమించను.’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన, ఆలోచన వలన రాష్ట్రంలో నాశనమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించటం జరిగిందన్నారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలని, వారికి ఇబ్బంది లేకుండా చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలతో వారి సమస్యలపై పలు దఫాలు చర్చించటంతో పాటు, దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న బెస్ట్ విధానాలను స్టడీ చేయాలని అధికారులను పంపిచటం జరిగిందన్నారు. వీటిపై ప్రత్యేక కమిటీలు వేసి చర్చించి నేషనల్ బిల్డింగ్ కోడ్ సలహాలు , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడల్ బిల్డింగ్ బైలాస్ కు అనుగుణంగా నిర్మాణ రంగంలో అనుమతుల నిబంధనలు సరళతరం చేస్తూ శుక్రవారం పురపాలక శాఖ జీవో జారీ చేసిందన్నారు. దీనిలో ముఖ్యంగా గ్రూప్ డెవల్మేంట్ స్కీం కు ఉన్న రెగ్యూలైజేషన్ రూల్స్ నే గ్రేటర్ కమ్యూనిటీలకి అమలు చేయటం జరుగుతుందన్నారు. రైల్వే , రక్షణ శాఖల పరిధిలో నిర్మాణాలకు వారు నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ చేసిన దరఖాస్తులను సంబందిత శాఖల నుంచి ఎన్వోసీలతో సంబంధం లేకుండానే అనుమతులు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. వాణిజ్య భవనాలతో పాటు 500 మీటర్లు పైన ఉన్న నివాస భవనాలకు సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వటం జరుగుతుందన్నారు. హైరైజ్ భవనాలు 55 -75 మీటర్ల ఎత్తు ఉన్న వాటికి 17 మీటర్లు, 70 -120 మీటర్లు ఎత్తు ఉన్నవాటికి 18 మీటర్లు, 120 మీటర్లు పైన వాటికి 20 మీటర్లు సెట్ బ్యాక్ ను పరిమితం చేస్తూ ఉపసమనం కల్పించటం జరిగిందన్నారు. అదే విధంగా అభివృద్ది చెందిన దేశల్లోను, ఇతర రాష్ట్రాల్లో తరహా 10 అంతస్తుల దాటిన భవనాలకు ఎన్వీరాల్మెంట్ డెక్ ను ఇవ్వటం జరుగుతుందని, దీనిలో ఫ్లవర్ గార్డెనింగ్ , గ్రీనరి , యోగా, స్పా, వీవింగ్ గ్యాలరీ వంటి వాటిని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వటం జరుగుతుందన్నారు. రహదారుల విస్తరణ సమయంలో స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు జారీచేయక పోయిన కోల్పోయిన స్థలానికి సమానంగా వెంటనే నిర్మాణ చేసుకునే ప్రోవిజన్ ఇవ్వటం జరిగిందన్నారు. అదే విధంగా 4000 చదరపు మీటర్లు గ్రూప్ డెవల్మేంట్ లోని నిర్మాణాలకు 10 శాతం ఓపెన్ స్పేస్ స్థలంలోని 15శాతం స్థలంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకునే అవకాశం కల్పించటం జరుగుతుందన్నారు. వ్యవసాయ జోన్ లో పౌల్టీ ఫారమ్ లు ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు మార్చు చేయటం జరిగిందన్నారు. టీడీఆర్ బాండ్ల ఫైనల్ చేసే కమిటీలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు వారిని తోలగించి మున్సిపల్ కమిషనర్ ను, రీజినల్ టౌన్ ప్లానింగ్ , స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులనే నియమించటం జరిగిందని, యు ఎల్ బీ లలో రెవెన్యూ ఆఫీసర్ చేర్చుతూ నిబంధనలు సులభతరం చేయటం జరిగిందన్నారు. అదే విధంగా లే అవుట్ లలో నాన్ హైరేజ్ భవనాలకు వారి స్థలం ముందు రహదారికి ఇవ్వాల్సిన స్థలాన్ని వదిలిస్తే వారికి వెంటనే అనుమతులు ఇచ్చేలా నిబంధనలు సడలించటం జరిగిందన్నారు. గ్రూప్ డెవల్మేంట్ ఇళ్ళకు కూడ వారి స్థలం వరకు రహదారి స్థలం వదిలేస్తే వారికి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. హైరైజ్ భవనాల్లో ఆర్డీపీ ని త్వరగా రూపొందించి కంప్లీట్ చేసి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లే అవుట్ ల ఏర్పాటుకు ఈరోజు నుంచి రహదారికి 9 మీటర్లు స్థలం వదిలితే సరిపోతుందన్నారు. దీనిని అందరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎమినిటీస్ లో క్లబ్ హౌస్, కన్వెన్షన్ హాలు కాకుండా మిక్సిడ్ హౌస్ అని పెడితే టౌన్ ప్లానింగ్ లో పెండింగ్ లేకుండా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జాతీయ రహదారుల పక్కన సర్వీస్ రోడ్డు అభివృద్ది చెంది జాతీయ రహదారుల అధికారులు ఎన్వోసీ తీసుకుంటే 12 మీటర్లు రహదారికి ఇవ్వాల్సిన అవసరం లేదని, జాతీయ రహదారుల అధికారులు కోరితే మాత్రం 12 మీటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నారు. దీనితో పాటు ఐదు అంతస్తుల భవనాలకు సెల్ఫ్ డిక్లేరేషన్ తోనే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా జీవోను రెండు రోజుల్లో ఇవ్వనున్నామన్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014-19 లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో మొదటిసారి ఆన్ లైన్ సిస్టం రెండు మూడు నిమిషాల్లోనే భవన నిర్మాణాలకు అప్రూల్ ఇచ్చే విధానంను తీసుకురావటం జరిగిందని, గత ప్రభుత్వం దీనిని సక్రమంగా నిర్వహించ లేదన్నారు. ప్రస్తుతం దీనిపై ఎంతో వర్క్ చేసి దేశంలోనే తొలిసారిగా మున్సిపల్ శాఖ సర్వర్ ను ఇతర శాఖల సర్వర్ కు అనుసంధానం చేసి మున్సిపల్ వెబ్ సైట్ లో నిర్మాణాలకు సంబంధించి ఫైర్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మైనింగ్ శాఖలకు ఫీజులు చెల్లిస్తే సంబంధిత శాఖలకు వెళ్ళేలా చేయటం జరుగుతుందన్నారు. వీటికి సంబందించిన అనుమతులు 15 రోజుల్లోనే ఇవ్వటం జరుగుతుందని, లేకపోతే డ్రీమ్డ్ గా అనుమతులు మంజూరు అయ్యే అంశంను సంబంధిత శాఖల అధికారులతో చర్చించటం జరిగిందని త్వరలోనే అమల్లోకి తీసుకురావటం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, ఎండి నసీర్ అహ్మద్,నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు సజీలా, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, నారెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ జీవీ హరిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చక్రధర్, ప్రాపర్టీ షో చైర్మన్ గద్దె తిరుపతి రావు, నారేడ్కో ప్రతినిధులు, సభ్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలుత నారేడ్కో ప్రోపర్టీ షో ప్రారంభోత్సవానికి గుంటూరు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద రాష్ట్ర మున్సిపల్ పరిపాలన , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , డీఐజీ సర్వశెష్టి త్రిపాఠి, శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, ఎండి నసీర్ అహ్మద్, కన్నా లక్ష్మీ నారాయణ, నక్కా ఆనంద బాబు , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జీయంసీ డిప్యూటీ మేయర్ సజీలా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *