-పల్లె పండుగ వారోత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ఆకట్టుకున్న స్టాళ్లు.. ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
-ప్రభుత్వ పథకాల సమాచారం సమాహారంతో స్టాళ్ల ఏర్పాటు
-హరిదాసు కీర్తనలు ఆలకిస్తూ.. పిట్టలదొర కబుర్లు వింటూ..
-మత్స్య సంపద వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్
పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధ్యయనం చేస్తూ.. ప్రభుత్వ శాఖల సమన్వయంతో వివిధ వర్గాల ప్రజలకు అందుతున్న సేవలపై పరిశీలన చేస్తూ.. అధికారులను అడిగి సందేహాల నివృత్తి చేసుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకర్గ కేంద్రంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిర్వహంచిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. హరిదాసు కీర్తనలు ఆస్వాదించారు. పిట్టల దొరల కోతలు, జంగమదేవరల జోస్యాన్ని ఆసక్తిగా ఆలకించారు. సంక్రాంతి పండుగ వేళ హరిదాసుకు బియ్యం వేసి మన సంస్కృతి, సంప్రదాయాలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మత్స్య, జౌళి, గ్రంథాలయ, ఉద్యానవన, మహిళాశిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు.
ఆకట్టుకున్న మిల్లెట్ స్టాళ్లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పవన్ కళ్యాణ్ డ్రోన్ల పని తీరు, సమీకృత వ్యవసాయ వల్ల లాభాలు, మిల్లెట్ సాగు విధానం, నిత్యం ఆదాయం ఇచ్చే ఏటీఎం మోడల్ వ్యవసాయం పొలంబడి, సేంద్రీయ ఎరువుల తయారీ, వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేశారు. సహజ సిద్ధంగా పండించిన చిరుధాన్యాలు ఈ స్టాల్ లో ఆకర్షణగా నిలిచాయి.
పుంగనూరు ఆవు ప్రత్యేక ఆకర్షణ
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ లో రాయితీతో పాడి రైతులకు అందిస్తున్న మేత కటింగ్ యంత్రం వివరాలు పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్టాల్లో పందెం పుంజు, మేకలతోపాటు పుంగనూరు ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పశుగ్రాసం, వివిధ రకాల దాణాలను ఈ స్టాలో ప్రదర్శించారు. పట్టు పరిశ్రమ శాఖ స్టాల్లో సెరీ కల్చర్, పట్టు గూళ్ల పెంపకం తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి అధ్యయనం చేశారు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలపై పవన్ కళ్యాణ్ ఆరా
మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో సముద్రంలో లభించే వివిధ రకాల మత్స్య సంపదను ప్రదర్శించారు. పండుగొప్ప, టూనా, వంజరం లాంటి చేపలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా తిలకించారు. మండ పీతలు, రొయ్యలలోని వివిధ రకాల వివరాలను ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ స్టాల్లో ఆలివ్ రిడ్లీ తాబేలుతో పాటు వివిధ రకాల పక్షుల నమూనాలను తిలకించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోరంగి అభయారణ్యంలో వన్య ప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా ఆరా తీశారు. ఉద్యాన శాఖ స్టాల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలతో పాటు సూక్ష్మ సేద్యం, బిందు, తుంపర సేద్యం, ఆయిల్ పామ్ విస్తరణ వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద తుంపర సేద్యం పరికరాల మంజూరు పత్రాలను పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు రైతులకు అందజేశారు. సత్తి నరేష్, కిమిలి షర్మిళ, బత్తుల నారాయణమ్మలకు వీటిని అందించారు.
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గర్భిణులకు సీమంతం వేడుక
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక గ్రూపులు తయారు చేసిన తినుబండారాల స్టాళ్లు, రాష్ట్రానికే తలామానికంగా నిలిచే కొయ్య బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు గర్భిణులకు సీమంతం వేడుక నిర్వహించారు. కె. వరలక్ష్మి, ఎ. రమ్యలకు ఆశీస్సులు అందించారు. స్థానిక రథాలపేట అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. తల్లిపిల్లలకు ఆ శాఖ అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ, జాందానీ చీరల ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు
దారిపొడవునా ఘన స్వాగతం
అంతకు ముందు పిఠాపురం పర్యటన నిమిత్తం రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజానగరం, పెద్దాపురం, సామర్లకోట, రంగంపేట దారి పొడవునా గ్రామగ్రామాన ప్రజలు ఉపమఖ్యమంత్రివర్యులకు ఘన స్వాగతం పలికారు. రహదారికి ఇరువైపులా హారతులు పట్టారు. పూల వర్షం కురిపించారు. వెల్కమ్ డిప్యూటీ సీఎం సర్ అంటూ యువత, చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ గ్రామాన తన కోసం వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. పిఠాపురం నియోజకవర్గం కుమారపురం నుంచి సభా వేదిక వరకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. జయజయధ్వానాలతో దద్దరిల్లాయి.