-అండర్ 19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం
-ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తమిళనాడు టీమ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాలతోటి స్పోర్ట్స్ సిటీ రానుంది. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మొగల్రాజపురం పీబీ సిద్ధార్ధ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ఈ వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో కర్ణాటక తో పోటీపడి తమిళనాడు విజయం సాధించింది. ఫైనల్స్ లో విజయం సాధించిన తమిళనాడు టీమ్ కు ఎంపి కేశినేని శివనాథ్, ఎస్.పి.డి బి.శ్రీనివాస్ ఐ.ఎ.ఎస్ తో కలిసి ట్రోపిను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను ముందుంచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్ధులకు చదువులతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం పెంచాలన్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత నగరంలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితో ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్స్ ను తన సొంత నిధులతో ఆధునీకరించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 23 వ తేదీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలకు ఎనిమిది రకాల క్రీడా వస్తువులు పంపిణీ చేయబోతున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ ప్రకటించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ విజయవాడలో నిర్వహించేందుకు కృషి చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ జి.భానుమూర్తి రాజు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీత అరికపూడి రమణరావు, స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ జి.భానుమూర్తి రాజు, మాజీ శాప్ చైర్మన్ అంకం చౌదరి, పి.బి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు , డి.ఐ.ఈ.వో. సి.ఎస్.ఎస్.ఎన్ రెడ్డి, పీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అండర్ 19 సెక్రెటరీ వి రవికాంత, జిల్లా వాలీబాల్ సంఘం కార్యదర్శి దోనేపూడి దయకర్ రావు, ఫీల్డ్ అబ్జర్వర్ ప్రదీప్ యాదవ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.