విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఆదివారం బీసెంట్ రోడ్డు రాఘవయ్య పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనులలో స్వామి వివేకానందుడు అగ్రగణ్యులని కొనియాడారు. మానవసేవే మాధవ సేవయని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన వివేకానందుడు తన ఉపన్యాసాలతో దేశ సంస్కృతి సాంప్రదాయాలు, వేదాలు, యోగాను దేశ విదేశాలకు పరిచయం చేశారన్నారు. అలాగే తన ప్రభోదాత్మక ప్రసంగాలతో మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఆత్మబంధువుగా మారారన్నారు. మహిళలపై స్వామి వివేకానందకు అపార గౌరవమని.. ‘స్త్రీలకు ఎలాంటి గౌరవం లభిస్తుందన్నదే ఒక దేశాభివృద్ధికి కొలమానం’గా ఆయన భావించారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువతను మేల్కొలిపి వారిని కార్యోన్ముఖుల్ని చేయటానికి ఆయన ఎంతగానో ప్రయత్నించారన్నారు. వివేకానందుని లాగా యువతను తమ ప్రసంగాలతో ప్రభావితం చేసిన నాయకులు వేరెవరు కనిపించరని చెప్పారు. యువశక్తి అణుశక్తి కంటే బలమైనదని చాటిన ఆయనను.. నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మురళీకృష్ణంరాజు, వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, వడ్డీ వాసు, అంజిబాబు, కాళ్ళ ఆదినారాయణ, దోనేపూడి శ్రీనివాస్, చాంద్ శర్మ, బంకా బాబీ, ఎం. ఎస్. నారాయణ, ప్రభల శ్రీనివాస్, కందగట్ల శ్రీనివాస్, ప్రేమ్, ప్రసాద్, అక్బర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …