-టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలను అందజేసిన రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ వాసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం లో పాలు పంచుకునే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని బిజెపి సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం అన్నారు. తాడేపల్లి లోని రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ వాసుల సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనానికి ఆదివారం ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ మహత్కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయల పంపిణీ చేసే అవకాశం ధార్మికవేత్తలకు దక్కిన మహద్భాగ్యమన్నారు.
సమాజంలో ఎంతోమంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. ఇటీవల తిరుపతి దుర్ఘటనలో మరణించిన స్వామివారి భక్తుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కూరగాయలను విరాళంగా అందించిన దాత కంటే రామ మోహనరావు, రాధిక దంపతులు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో అప్పటి టీటీడీ చైర్మన్ దివంగత కనుమూరి బాపిరాజుతో చర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గత 18 సంవత్సరాలుగా దేవదేవుడుని దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే నిర్వహిస్తోందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు. భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ అద్వితీయ వితరణకు సహాయం అందించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వి. కోటేశ్వరరావు, సుంకర శ్రీనివాసరావు, ఏవీఆర్కే ప్రసాద్, జగదీష్, ఎన్. ఎస్. ఎన్. రావు, ఉపేంద్ర, పూర్ణచంద్రరావు, భవాని శంకర్, రామారావు తదితరులతో సహా పలువురు ధార్మిక, ఆధ్యాత్మికవాదులు పాల్గొన్నారు.