-ఎసిఎ క్రికెట్ స్టేడియంలో ఎంపియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
-క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్
-రాజధాని ప్రాంతంలో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు
-ఏసీఏ తరుఫున త్వరలో ఎపిఎల్ టోర్నమెంట్
-జనవరి ఆఖరుకి విజయనగరం క్రికెట్ అకాడమీ ప్రారంభం
-రూ.50 కోట్లతో వైజాగ్ స్టేడియం ఆధునీకరణ పనులు
-అభివృద్ధి విషయంలో మంత్రి నారా లోకేష్ ముందంజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. అందుకే రాజధాని ప్రాంతం మంగళగిరిలో ని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను అభివృద్ది చేయటంతో పాటు, అమరావతిలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 23 వరకు మంగళగిరిలో ప్రీమియర్ లీగ్ (ఎంపియల్), సీజన్-3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ ఎంపియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై ఎంపియల్ సీజన్-3 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఎంపియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య , గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ , ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపియల్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.
ఎంపియల్ లీగ్ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో తలపడిన మంగళగిరి టీమ్ , విజయనగరం జిల్లా టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ టాస్ వేయగా మంగళగిరి టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజలు చాలా అదృష్టవంతులు… మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేసే విషయంలో తమ అందరి కంటే ముందువున్నారని కొనియాడారు.
ఎంపియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావటం ఎంతో ఆనందంగా వుందన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారన్నారు.
గతంలో నియోజకవర్గం స్థాయికే పరిమితం అయిన ఈ క్రికెట్ పోటీలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సహకారంతో ఈ ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మంగళగిరి టీమ్‌తో పాటు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొ టీమ్ పాల్గొందన్నారు. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 23వ తేదీ జరుగుతుందని…ఆ రోజే విన్నర్స్ తో పాటు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకి బహుమతి ప్రధానోత్సవం వుంటుందన్నారు.
ఈ లీగ్ మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చిన క్రికెట్ క్రీడాకారులకి ఎసిఎ తరుఫున ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఏ తరుఫున క్రీడాకారులకు అవసరమయ్యే గ్రౌండ్స్ తో పాటు అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని….విజయనగరంలో ఏర్పాటు చేయనున్న క్రికెట్ అకాడమీ జనవరి నెలాఖరులో ప్రారంభం కానుందన్నారు. అలాగే అనంతపురంలోని లేడీస్ క్రికెట్ అకాడమీ ఈ నెలాఖరికి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజధాని ప్రాంతంలో రెండు స్టేడియాలు వుండే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. రాజధానిప్రాంతం అయిన అమరావతి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి ప్రాంతాలకు క్రీడాకారులకి ఈ స్టేడియాలు అందుబాటులోకి ఎంతో ఉపయోగం వుంటుందన్నారు.
ఇక మంగళగిరి క్రికెట్ స్టేడియం లో కూడా అభివృద్ధి పనులు చేయబోతున్నట్లు తెలిపారు. మద్రాస్ ఐఐటి వారితో స్టేడియంను పరీక్షించటం జరిగిందన్నారు. ఈ స్టేడియంను పన్నెండు ఏళ్లు నిరు పయోగంగా ఉంచటం వల్ల గ్యాలరీల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయని తెలిపారు. ఈ స్టేడియంను రిపేర్ చేయించి అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ స్టేడియంకు సమీప ప్రాంతంలోనే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నట్లు తెలిపారు.
అన్నింటి కంటే ముఖ్యంగా యువ క్రీడకారులకు ప్రతిభతో పాటు క్రమశిక్షణ వుండాలన్నారు. ఎంత ఎదిగినా ఓదిగి వుండటం నేర్చుకోవాలన్నారు . రాజకీయంగా ఎంత ఎదిగినా ఓదిగి వుండే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లను స్పూర్తి గా తీసుకోవాలన్నారు. ఎంత ఎదిగిన ఒదిగి వుంటే అంత ఆదరణ లభిస్తుందన్నారు
ఎంపియల్ టోర్నమెంట్ లో పోటీపడే క్రికెటర్స్ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు నితీశ్ కుమార్ రెడ్డి ను ఆదర్శంగా తీసుకుని రాణించాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఒక మ్యాచ్ లో ఓడిపోతే నిర్సుతాహ పడకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
ఈ విషయంలో మంత్రి నారాలోకేష్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమి చెందిన తర్వాత…నిరుత్సాహపడకుండా గట్టి పట్టుదలతో కృషి చేసి అత్యధిక మెజార్టీతో లోకేష్ గెలిచారన్నారు. అలాగే క్రీడాకారులు కూడా ఓటమికి నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ముందుకు సాగి విజయాలు అందుకోవాలని చెప్పారు.
ఎసిఎ తరుఫున క్రీడాకారులకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కృషి చేస్తామన్నారు. ఏసీఏ తరుఫున త్వరలో ఎపిఎల్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఎపి నుంచి 25 మంది ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆంధ్ర నుంచి ఆరుగురుసెలెక్ట్ అయినట్లు పేర్కొన్నారు.
ఇక వైజాగ్ స్టేడియాన్ని రూ50 కోట్ల లతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు మార్చి కల్లా పూర్తి చేసిన ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. జి.ఎమ్.ఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ డేర్ డేవిల్స్ టీమ్ మ్యాచ్ లు రెండు జరుగుతాయన్నారు.మంగళగిరి క్రికెట్ స్టేడియం వద్ద ఫోర్ లైన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రానున్న బడ్జెట్ లో శాంక్షన్ కానుందన్నారు.
స్కూల్, కాలేజీ విధ్యార్ధుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు రాబోయే కాలంలో స్టేడియంలో ఉచితంగా క్రికెట్ మ్యాచులు చూసే వెసులు బాటు , బోజన సుదపాయం కల్పించి మ్యాచులు చూసి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునే విధంగా కృషి చేస్తామన్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో తన సొంత నిధులతో 147 ప్రభుత్వ పాఠశాలల మైదానాలను ఆధునీకరించి లాంగ్ జంప్ పిట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 23 వ తేదీన మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా 8 రకాల క్రీడా వస్తువులతో స్పోర్ట్స్ కిట్స్ ను ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య సంఘం నాయకులు సంకా బాలాజీ గుప్తా , టిడిపి నాయకులు తోట పార్థ సారథి, పర్వత మధు, మున్నంగి శివ శేషయ్య, గోవాడ దుర్గారావు, మున్న షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్, ఆరుద్ర భూలక్మి, గోసాల రాఘవ, జొన్నదుల బాలకృష్ణ , తోట పవన్, తురక వీరశేఖర్, కొత్తా శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, జనసేన నాయకులు మునగపాటి వెంకట మారుతి రావులతో పాటు ఎన్డీయే కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.