– ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా శ్రమించి యువత ముందడుగు వేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని చేరుకునేందుకు శ్రమించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఆదివారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవం సందర్భంగా విజయవాడలోని రాఘవయ్య పార్కు వద్ద జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అధికారులతో కలిసి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సౌశీల్యం, నిరంతర అధ్యయనంతో స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువత తమను తాము తీర్చిదిద్దుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ఆయన సందేశం యువత విజయానికి సరైన మార్గనిర్దేశనమని పేర్కొన్నారు. ఏటా ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్నిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని యువత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని.. రాష్ట్రం, దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి యు.శ్రీనివాసరావు పాల్గొన్నారు.