-కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత పదమూడు సంవత్సరాలుగా విద్యకు ప్రాధ్యానత ఇస్తూ…పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందించటమే కాకుండా ఆ పేద విధ్యార్ధుల తల్లిదండ్రులకు చేయూతగా వుండేందుకు కూడా ఆర్థిక సాయం చేస్తున్న కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు వల్లూరు పూర్లచంద్రరావు, ఆయన సతీమణి వల్లూరు కస్తూరి బాయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం బృందావన్ కాలనీలోని వారి నివాసంలో పేద విద్యార్దులకు స్కాలర్ షిప్స్, రోగులకు, పేదలకు ఆర్థిక సాయం చేయటంతోపాటు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరైయ్యారు. ఈకార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ తరుఫున పేద విద్యార్ధులకు, రోగులకు, పేదలకు ఎంపి కేశినేని శివనాథ్ ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలోని తొలితరం రాజకీయ నాయకుల్లో ఒకడైన వల్లూరు పూర్ణచంద్రరావు పట్టుదల కార్యదక్షత గల రాజకీయ నాయకుడని కొనియాడారు. ఆయన పేదల సాయం చేయటమే కాకుండా విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గత 13 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ నిర్వహించటం గొప్ప విషయమన్నారు. భవిష్యత్తులో ఈ ఫౌండేషన్ సేవలు మరింతగా అందించాలని ఆకాంక్షించారు. ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్దితో పాటు, విద్యావ్యవస్థ పై దృష్టి సారించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్ధులు పేదరికం వల్ల విద్యకు ఎలాంటి ఆటంకం రాకుండా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమల్లోకి రాబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం వల్ల ఇంట్లో ఎంతమంది విద్యార్ధులు వుంటే వారందరికీ రూ.15 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. విద్యార్దులకు అన్ని సదుపాయాలు వుండాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల్లోని గ్రౌండ్స్ ఆధునీకరించి లాంగ్ జంప్ పిట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్ధులు క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు 8 రకాల క్రీడాపరికారాలతో కూడిన స్పోర్ట్స్ కిట్ ను ఈ నెల 23వ తేదీన 147 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించబోతున్నట్లు తెలిపారు.
కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ వల్లూరు రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ముఖ్యఉద్దేశ్యం విద్యను ప్రొత్సహించటం అన్నారు. అందుకే ఫకీరు గూడెంలో వున్న మునిసిపల్ స్కూల్, మునిసిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని మునిసిపల్ స్కూల్ విద్యార్దులకు స్కాలర్ షిప్స్ తో ప్రోత్సహించటమే కాకుండా యూనిఫార్మ్, బూట్లు, బెల్ట్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రూ.2 లక్షల75 వేల రూపాయలు పేద విద్యార్ధులతో పాటు పేదలు,రోగులకు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామ్ ప్రసాద్, వల్లూరు అశోక్ బాబు, చిలకపాటి ఉషారాణి లతోపాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.