Breaking News

విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ సూపర్!


-అంతర్జాతీయ నిపుణుల అభినందనలు
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఏపీ ముందుచూపు భేష్
-కేంద్ర ప్రభుత్వ ప్రశంస
-ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో ఈఈ ఫైనాన్సింగ్ కీలకం: బీఈఈ
-2031కల్లా దేశంలో ఈఈలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: వినీత్ కన్వాల్
-ఈఈ ఫైనాన్సింగ్ వేదికగా విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్
-దేశంలో ఇదే తొలిసారి
-ఐఈఏ నివేదిక ప్రకారం గరిష్ఠ స్థాయికి చేరనున్న కర్బన ఉద్గారాలు
-ఈఈ కార్యక్రమాల అమలుతో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి ఏపీ కట్టుబడి ఉంది
-రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులే కీలకం. ఈ క్రమంలో దేశంలో జరిగిన ఏకైక ఇన్వెస్ట్మెంట్ బజార్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమలను అనుసంధానం చేయడానికి చక్కటి వేదికగా నిలిచింది. విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ గురించి అంతర్జాతీయ వెబినార్లో ప్రస్తావించారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, డెన్మార్క్ దేశాల ప్రతినిధులు ఈ వెబినార్లో పాల్గొన్నారు. వారంతా అంతటి ప్రధానమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ), ఏపీ ప్రభుత్వ ఇంధన శాఖకు చెందిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం)(స్టేట్ డేసిగ్నేటెడ్ ఏజెన్సీ) ల పై ప్రశంసల వర్షం కురిపించారు.
రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో వేగంగా మార్పులు తేవడం, పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల పెట్టుబడులను ప్రోత్సహించడమే ఇన్వెస్ట్మెంట్ బజార్ లక్ష్యం. కొవిడ్ సంక్షోభ సమయంలో పారిశ్రామిక రంగం సుస్థిరత కోసం ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలును వేగవంతం చేయడంపై ఏపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందంటూ రాష్ట్ర ముందుచూపును కేంద్ర ప్రభుత్వం కొనియాడింది. ఈ విషయాన్ని బీఈఈ, కేంద్ర విద్యుత్తు శాఖ ప్రస్తావించాయి.
ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ పై పారిస్ కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) బీఈఈతో కలిసి నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ అజయ్ భాక్రే మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైనాన్సింగ్ దే కీలక పాత్ర అన్నారు. 2030కల్లా దేశ జీడీపీలో 33 నుంచి 35 శాతం వరకు ఉద్గారాల తీవ్రతను తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇదెంతో కీలకమని చెప్పారు. రాబోయే దశాబ్దంలో ఈఈ ఫైనాన్సింగ్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి దేశం, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేవారు, ప్రతి విభాగం.. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోనున్నాయని తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీలు అవసరమవుతాయని, అందుకు భారీగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని భాక్రే చెప్పారు.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం.. కర్బన ఉద్గారాలు 2023 నాటికి అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి చెప్పారు. స్వచ్ఛ ఇంధనం కోసం కేవలం రెండు శాతం మాత్రమే పాండమిక్ రికవరీ ఫైనాన్స్ ను ఖర్చు చేయడమే దీనికి కారణమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తూ గ్రీన్ హౌస్ ఉద్గారాలను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందని తెలిపారు. ఇందుకోసం ముఖ్య మంత్రి , వై ఎస్ జగన్మోహన్ రెడ్డి , ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నారన్నారు . ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేసేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ సౌజన్యంతో ఏపీఎస్ఈసీఎం పారిశ్రామిక రంగాన్ని, వివిధ ప్రభుత్వ విభాగాలను, సాధారణ ప్రజలకు సహకారం అందిస్తోందని వివరించారు.
విశాఖ ఇన్వెస్ట్మెంట్ బజార్ ను విజయవంతం చేయడంలో సాయపడిన, ప్రస్తుత వెబినార్లో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు గాను బీఈఈ, రాష్ట్ర పరిశ్రమల శాఖకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, మరిన్నిపెట్టుబడులు రాబట్టేందుకు 5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టాలని బీఈఈని మరోసారి అభ్యర్థించారు.
2030కల్లా దేశంలో శిలాజ ఇంధనాలకు సంబంధంలేని 40 శాతం స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ తెలిపారు. అలాగే 2030 కల్లా అడవులు, చెట్లను పెంచడం ద్వారా 2.5 నుంచి 3 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. బీఈఈ నివేదిక ప్రకారం 2031 కల్లా దేశంలో ఇంధన సామర్థ్య రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. తద్వారా 86.9 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయొచ్చన్నారు. ఇందులో 50 శాతం పారిశ్రామిక రంగం నుంచే చేయవచ్చని తెలిపారు.
ఏపీఎస్ఈసీఎం విశాఖపట్నంలో తొలిసారిగా ప్రారంభించిన ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ కింద ఇన్వెస్ట్‌మెంట్ బజార్ వర్క్‌షాప్ సరికొత్తదని వినీత చెప్పారు. అలాగే దేశంలో ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ యొక్క లక్ష్యం ఆర్థిక సంస్థలు, అన్ని పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడమేనని తెలిపారు. ఇంధన పరిరక్షణ, సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, పర్యవేక్షించడంతో పాటు అమలు చేయడంలో ఏపీఎస్ఈసీఎం చురుకైన పాత్ర పోషిస్తోందని ఆమె ప్రశంసించారు.
ఈఈ ఫైనాన్సింగ్‌లో బీఈఈ ఇంధన సామర్థ్య(ఈఈ) ప్రాజెక్టుల గ్రేడింగ్ వంటి కొత్త పథకాలను ప్రారంభించబోతున్నట్లు వినీత తెలిపారు. ఇలాంటి 100 ఈఈ ప్రాజెక్టుల గ్రేడింగ్ ఖర్చును తిరిగి చెల్లించడం, ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు, ఈఈ ఫైనాన్సింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ బ్యాంకులు/మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా ఈఈ ఉపకరణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇప్పించడం వంటివి చేయనున్నట్లు చెప్పారు.
ఈఈ ఫైనాన్సింగ్ నోడల్ ఏజెన్సీ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) సీనియర్ అధికారి దీపక్ జైన్ మాట్లాడుతూ.. బీఈఈతో కలిసి తాము రెండు కొత్త పథకాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వడ్డీ తగ్గింపు రూపంలో ఆర్థిక సాయం అందించే పథకం ఒకటి అని.. దీని కింద సాధ్యమైనంత ఎక్కువగా వడ్డీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక రెండోది రుణగ్రహీత క్రెడిట్ రేటింగ్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే పథకమని చెప్పారు. ఇవి కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నాయని, వీటిపై కేంద్ర ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఈ వెబినార్లో ఓఈసీడీ నుంచి జాన్ డులాక్, బీఈఈ డైరెక్టర్ అర్జిత్ సేన్ గుప్తా, ఐఆర్ఈడీఏ డీజీఎం కె.పి.ఫిలిప్, సిడ్బి జీఎం రాజీవ్ కుమార్, ఐఎఫ్సీ అశుతోశ్ టాండన్, యూరోప్ కు చెందిన ఈఈ క్యాపిటల్ అడ్వయిజర్ పీటర్ స్వెట్ మ్యాన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *